Nancharaiah merugumala (senior journalist)
__________________________
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల బూట్లు తుడవడం తనకు గర్వకారణం అన్న పేర్ని వెంకట్రామయ్య (నానీ) వంటి అగ్రకుల కాపులూ, గుజరాతీ వైశ్య రత్నం అమిత్ షా కు కేవలం చెప్పులు మాత్రమే మెరుపు వేగంతో అందించిన ఓబీసీ మున్నూరు కాపు సోదరుడు బండి సంజయ్ కుమార్ వంటి మున్నూరు కాపులూ రాజకీయంగా ఇంకా ఇంకా ఎదిగిపోవడం ఎందరికో ఇష్టం లేదు. అందుకే, రెండు తెలుగు రాష్టాల్లోని సాద్బ్రాహ్మణ మేధావుల నాయకత్వాన అన్ని కులాలోళ్ళూ-సంజయ్ భాయ్ ని ఎగతాళి చేస్తున్నారు.
కాశ్మీరీ బ్రాహ్మణ తల్లి ఇందిరా ప్రియదర్శినీ కడుపున పుట్టిన దివంగత యువనేత సంజయ్ గాంధీ పేరు అనవసరంగా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. 1976 ఎమర్జెన్సీ కాలంలో ఉత్తర్ ప్రదేశ్ బాపన ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ, గుంటూరు ఎంపీ, నాటి కమ్మ కేబినేట్ కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య ఎంతో ధైర్యంతో సంజయ్ గాంధీకి చెప్పులు అందించడాన్ని ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.
బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన యువరాజుల చెప్పులు తివారీ, రఘురామయ్య గారు వంటి అగ్రకుల పెద్దలు మాత్రమే మోయాలని వాదించడం 2022లో హేతుబద్ధం కాదు. ఎంతైనా, మున్నూరు కాపు నేత ముఖ్యమంత్రి స్థాయికి కష్టపడి ఎదగడం తెలంగాణలో బ్రామ్మలు, వెలమలు, రెడ్లు, వైశ్యులకే కాదు ఇతర ఓబీసీలకూ, ఎస్సీలు, ఎస్టీలకూ కూడా ఇష్టం లేదని వారి మాటలు చెబుతున్నాయి.
1978లో నిజామాబాద్ జిల్లాకు చెందిన మున్నూరు కాపు దిగ్గజం గడ్డం (అరుగుల) రాజారామ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాల్సింది. తెలంగాణ, సీమ రెడ్లు ఏకమై పీసీసీ నేత మర్రి చెన్నారెడ్డి గారికి సీఎం పదవి కట్టబెట్టారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు, తర్వాత ప్రధాని కావాల్సిన మున్నూరు కాపు మేరు పర్వతం పుంజాల శివశంకర్ గారిని అగ్రవర్ణాలు రాజకీయంగా పక్కకు తప్పించేశాయి. ఇప్పుడు మున్నూరు కాపు కుటుంబాల్లో పుట్టిన ఇద్దరు లోక్ సభ సభ్యులు, మరో ఇద్దరు రాజ్యసభసభ్యులు తెలంగాణకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకపక్షం టీఆరెస్ లో కురువృద్ధుడు, మున్నూరు కాపు బుద్ధిజీవి కంచర్ల కేశవరావు గారు (83 ఏళ్లు) ఇంకా జీవించి ఉండగానే బండి సంజయ్ పై విమర్శలు రావడం బహుజనులకు బాధాకరం కాదా?తెలంగాణలో మున్నూరు కాపు ముఖ్యమంత్రి కాకూడదా?