(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర)
ప్రత్యేక వ్యాసం :
===========================
ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ విషయం విజ్ఞులైన తెలంగాణ ప్రజానీకానికి తెలుసు.
కేసీఆర్ ఒక్కరే కష్టపడి తెలంగాణ తెచ్చానని అనుకుంటున్నరు కాబట్టేనా, ఆయన కుటుంబానికే నీళ్లు నిధులు నియామకాలు ఇచ్చుకుంటున్నరు? అందుకే ఆయన బంధువర్గ నియోజకవర్గానికే అభివృద్ధి చేసుకుంటున్నరు? కానీ, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలను ఏ మాత్రం పట్టించుకుంటున్నారో యావత్ తెలంగాణ చూస్తూనే ఉన్నది. ఉపఎన్నికలు ఉంటేనే కేసీఆర్ ఫామౌజ్, ప్రగతి భవన్ గడప దాటుతరు. ఎన్నో ఏండ్లుగా ఫ్లోరైడ్ సమస్యతో పోరాడుతున్న మునుగోడు, చండూరు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతాలను చూడటానికి ఈ ఎనిమిదేండ్లల్ల ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎన్నిసార్లు ఆ గడ్డపై అడుగుపెట్టిన్రు? ఎప్పుడయినా వాళ్ల గురించి పట్టించుకున్న పాపాన బోయిన్రా? కానీ, ఇయ్యాల ఉపఎన్నిక వచ్చింది కాబట్టి, మళ్లీ టీఆర్‌ఎస్ మాయల దండు దిగుతున్నది.
బిజెపి అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుండి నేను 2009, 2014, 2018 లో మూడుసార్లు పోటీచేశాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం బిజెపి పక్షాన నిరంతరం పోరాడుతున్నాము. 2014 లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టిడిపి హయాంలో మునుగోడు ఎంత అభివృద్ధి జరిగిందో చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఈ నియోజకవర్గం పైన పూర్తి అవగాహన మాకు ఉంది.
2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఆఘ మేఘాల మీద గాలిమోటర్ లో మునుగోడులో దిగిన కేసీఆర్, ఎన్నో గాలి మాటలు చెప్పి పోయిన్రు. ఆ గాలి మాటల్లో మొదటిది ‘‘గట్టుప్పల్ మండలం కావాలని మీరు కోరుతున్నరు. 15 రోజుల్లో జీవో అమలు చేస్తా’’ అని చెప్పిపోయిన మనిషి, నాలుగేండ్లయినా మళ్ల ఇటు దిక్కు చూడలే. ఇగ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుందని గట్టుప్పల్ ని మండలం చేస్తున్నట్లు ప్రకటించిన్రు. ఇది ఉపఎన్నిక ద్వారా బిజెపి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాధించిన విజయం కాదా? ఇగ రెండో గాలి మాట ‘‘చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ కావాలని కోరుతున్నరు. హండ్రెడ్ పర్సెంట్ నెల రోజుల లోపల్నే శాంక్షన్ చేయిస్తా’’ అని మనవి చేసుసుకొని, మళ్ల దాని గురించి ఒక్క మాట మాట్లాడిన్రా?
మా ఆకుపచ్చ మునుగోడు ఏమయింది?
అన్నింటికి మించి మూడో గాలి మాట ‘‘మునుగోడు ప్రాంతానికి లక్షా 75 వేల ఎకరాలకు నీళ్లొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్…డిండి పథకాన్ని రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో పూర్తిచేసి, ఆకుపచ్చ మునుగోడు చేసే బాధ్యత నాది’’ అని ప్రజలసాక్షిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, మళ్ల ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు వస్తున్నారు. నాలుగేండ్లయినా కనీసం డిరడి ప్రాజెక్టు కాలువలు కూడా తవ్వలేదు. కేసీఆర్ గాలి మాటలకు చేతలకు మధ్య ఎంత తేడా ఉంటుందో అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న మునుగోడు ప్రజలు, కేసీఆర్ రంగు బయటపెట్టడానికి ఎమ్మెల్యే పదవిని వదులుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఒకటిన్నర సంవత్సరం కాదు, నాలుగేండ్లు పూర్తయినయ్. ‘మా ఆకుపచ్చ మునుగోడు ఏమయింది?’ అని అడుగుతున్న మునుగోడు ప్రజలకు సమాధానం చెప్తేనే కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ సపరివారానికి మునుగోడు గడ్డపై ఓట్లు అడిగే హక్కు ఉంటుంది.
మునుగోడు ప్రాంతంలో ఉన్న చేనేతలకు మాత్రం కేసీఆర్ ఏం చేసిన్రు? బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ పాదయాత్రలో, ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రముఖ్‌గా అడుగడుగునా వారి బాధలను చూశాను. స్వరాష్ట్రంలో కూడా చేనేతల మగ్గం గుంటలనే ఉన్నది. పద్మశాలీలకు రుణాలు ఇస్తలేరు. మగ్గాలకు సబ్సిడీ ఇస్తలేరు. చేనేతలు నేసిన చీరలకు మద్దతు ధర కూడా ఇస్తలేరు. ఇక, 2018 మునుగోడు ఆశీర్వాద సభలో కేసీఆర్ చెప్పినట్టు మునుగోడు గీతకార్మికులు ఏమైనా బాగుపడ్డారా? అని ఒక్కసారి పరిశీలిస్తే కష్టపడి వాళ్ల పిల్లలను చదివిస్తే… వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు. వారిలో కొంతమంది ఆటోలు నడుపుతూ బతుకెళ్లదీస్తుంటే, ఇంకొందరు మళ్లీ తాటిచెట్టునే నమ్ముకొని ప్రాణాలను ప్రమాదాల అంచున పెట్టుకొని బతుకుతున్నరు. ఇగ యాదవులను కోటీశ్వరులను చేయబోతున్నా అని కూడా ఆ సభలో చెప్పిన గాలి మాటలు ఇంకా మునుగోడు యాదవుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నయ్ కానీ, అవి నిజం కాలే.
2009 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మునుగోడు నియోజకవర్గ హద్దులు మారాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మహాకూటమి (టీఆర్‌ఎస్, టిడిపి, కమ్యూనిస్టులు) భాగంగా కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించిన్రు. 2009 నుంచి 2014 వరకు సిపిఐ పార్టీకి చెందిన శాసనసభ్యుడు నియోజకవర్గ అభివృద్ధిపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. దాని పర్యావసానమే 2014లో ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించిన్రు. 2014 నుంచి 2018 వరకు మునుగోడులో ఉన్నది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే. ఈ నాలుగేండ్లు టీఆర్‌ఎస్ అభివృద్ధి చేసి ఉంటే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే 2018 ఎన్నికల్లో గెలిచేవారు కదా? 2018 లో టీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది?
2018లో కాంగ్రెస్ నుంచి పోటి చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై సవతి ప్రేమ చూపిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మునుగోడు గోడు అట్లనే మిగిలిపోయింది. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల అనుభవంతో, ఉపఎన్నికతోనే మునుగోడు
అభివృద్ధి జరుగుతుందనే సదుద్దేశ్యంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవిని త్యాగం చేసి, బిజెపి పార్టీలో చేరి నియంతృత్వ పాలనపై ప్రజాస్వామిక పోరాటానికి శ్రీకారం చుట్టిన్రు. మునుగోడు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతీ ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ పవిత్ర ఆశయానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం
ఉంది.
తెలంగాణలో కేవలం ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి సాధ్యమైతది..!
తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి సాధ్యమైతదని దుబ్బాక, హుజూర్‌నగర్, నాగర్జునసాగర్, హుజురాబాద్ ఎన్నికలతో తెలిసొచ్చింది. రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యం అన్న రాజగోపాల్ రెడ్డి మాటలు, వాస్తవానికి ఈ రోజు నిజమైతున్నయ్. ఆయన రాజీనామా చేశాకే డిరడి లిఫ్ట్ నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత బీమాపై చలనం వచ్చింది, మునుగోడులో రోడ్లు, బ్రిడ్జీలకు రూ.7 కోట్లు, అంగన్ వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులకు క్లియరెన్స్ వచ్చింది. సీసీ రోడ్లకు ప్రతిపాదనలు వస్తున్నయ్. మిషన్ భగీరథ పనులు మొదలైతున్నయ్.
మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లను కొత్తగా మంజూరు చేశారు. సర్పంచుల పాత బిల్లులకు మోక్షం లభిస్తున్నది. పెండిరగ్ లో ఉన్న హామీలూ క్లియర్ అవుతున్నయ్. గౌడ్ల సామాజికవర్గాన్ని ఆకట్టుకోసం అధికారికంగా సర్వాయిపాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఉపఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాధించిన, బిజెపి పార్టీ విజయం కాదా? టీఆర్‌ఎస్ పక్షపాత పాలనకు ఇంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలే?
కేజీ టు పీజీ ఉచిత విద్య నుంచి మొదలుపెడితే, ఇంటికో ఉద్యోగమని మోసం చేసిన్రు. ఉద్యోగమియ్యకుంటే రూ. 3,016 నిరుధ్యోగ భృతి ఇస్తమని మోసం చేసిన్రు. మహిళలకు సున్న వడ్డీకే రుణాలు ఇస్తమని మోసం చేసిన్రు. దళితులను ముఖ్యమంత్రి చేస్తనని, దళితులకు మూడెకరాల భూమిస్తనని మోసం చేసిన్రు. చివరికి ఎన్నికలున్న చోట తప్ప వేరే చోట దళిత బంధు ఇవ్వకుండా దళితులను మోసం చేసిన్రు. బీసీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేసిన్రు, వారికి స్వయం ఉపాధి లోన్లు ఇవ్వకుండా వారి జీవనాన్ని దెబ్బ తీసిన్రు. రైతులకు రుణమాఫీ అని, ఉచిత ఎరువులని మోసం చేసిన్రు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తమని మోసం చేసిన్రు. ఇట్లా కేసీఆర్ తన కుటుంబాన్ని తప్ప ప్రతివర్గాన్ని మోసం చేసిన్రు.
టీఆర్‌ఎస్ పాలన అద్భుతం అని చెప్పుకుంటున్నరు కదా? ఒక్కసారి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్‌తో కలిసి నడిచిరండి, టీఆర్‌ఎస్, కేసీఆర్ గారడీ మాటలతో దగా పడ్డ తెలంగాణను, అడుగడుగునా ఆకలి, అప్పులతో అల్లాడుతున్న కష్టాల తెలంగాణను బిజెపి చూపిస్తుంది. ‘‘ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అయిన అవినీతి, బంధుప్రీతిని ఓడిరచడానికి అందరూ కలిసి కట్టుగా ముందుకు రావాలి’’ అని 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పిలుపును అందుకొని ప్రతి భారతీయుడు కదనరంగంలో దూకే సమయం ఆసన్నమయింది.
ఇక్కడ మన తెలంగాణ కూడా ఒక అవినీతి, కుటుంబ పార్టీ చేతిలో బందీ అయ్యింది. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరలేదు. తెలంగాణ ఏర్పడిరది, సకల జనుల కోసమే కానీ, కేసీఆర్ సకుటుంబపరివారం కోసం కాదు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ చెప్పినట్టుగా తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది బిజెపి ఆకాంక్ష. కుటుంబ పార్టీలను తరిమేస్తేనే… రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్న ఆయన మాటలు అక్షర సత్యం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాటల స్ఫూర్తితో కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించే దిశగా, ఇప్పుడు మునుగోడులో మరో ముందడుగు పడబోతున్నది, కాషాయ జెండా ఎగరబోతున్నది.