“వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమెరగని ‘‘టీమ్ ఇండియా’’ విశ్వవిజేతగా నిలిచి ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చతికిలపడింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం పరాజయానికి దారితీస్తుందని గతంలో అనేకసార్లు రుజువైంది. అందులో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమి ఒక తాజా ఉదాహరణ. ఈ ఓటమి తెలంగాణలోని రాజకీయ పార్టీలకూ ఒక పాఠమే. “
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్‌ఎస్ అతి విశ్వాసం ప్రదర్శిస్తే 2023 ఎన్నికల్లో బొక్కబోర్ల పడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న మాట వాస్తవం. అయితే ఈ అనుకూల పవనాలు విజయానికి చేరువ చేస్తాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణనలోనికి తీసుకోకుండా అధికారంలోకి వచ్చేశామని గాలిలో మేడలు కడుతూ ఊహాలోకంలో ఉంటే కాంగ్రెస్‌కు కూడా భంగపాటు తప్పకపోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరూ కలుసుకున్నా ‘తెలంగాణలో ఎవరు గెలుస్తారు?’ అనే చర్చే నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం కర్నాటక ఎన్నికల వరకు తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకోవడంతో ప్రస్తుతం ‘నువ్వా? నేనా?’ అంటూ బీఆర్‌ఎస్ పార్టీకి సవాల్ విసరడమే. రాబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అంచనాకు వచ్చే ముందు పీపుల్స్‌పల్స్ సంస్థ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి . 2009 లో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తరువాత ఇప్పటివరకు జరిగిన 3 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌పార్టీ ఇప్పటివరకు 50 స్థానాలకు మించి గెలుపొందలేదు. ఈ 50 స్థానాలు 2009 ఎన్నికల్లో గెలుపొందింది.
2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య 18 శాతానికి పైగా ఓట్ల వ్యత్యాసం ఉంది. బీఆర్‌ఎస్ 46.9 శాతం ఓట్లతో 88 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్‌కి 28.4 శాతం ఓట్లతో 19 సీట్లు వచ్చాయి. 2013 నుంచి 2023 మధ్య వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను పీపుల్స్‌పల్స్ సంస్థ శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు 8 నుంచి 10 శాతం ఆధిక్యంతో గెలిచి అధికారం చేపట్టిన ఒక పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయిన సంఘటనలు చాలా అరుదు. పంజాబ్‌లో కాంగ్రెస్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి తప్ప ఏ రాష్ట్రంలో కూడా ఇలా అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోలేదు. పంజాబ్‌లో కాంగ్రెస్‌లో చీలిక కారణంగా ఓటమి పాలవ్వగా, హిమాచల్ ప్రదేశ్‌లో కేవలం 0.5 శాతం ఓట్ల తేడాతో బీజేపీ ఓటమిపాలయ్యింది. ఈ లెక్కన చూసినప్పుడు గత ఎన్నికలతో ఫలితాలతో పోలిస్తే బీఆర్‌ఎస్ ` కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని కాంగ్రెస్‌పార్టీ పూడ్చుకుని విజయంసాధిస్తే చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ రోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పతనం ఇప్పటికిప్పుడు మొదలయ్యింది కాదు. బీఆర్‌ఎస్ కారుకు బ్రేకులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో తేలాలంటే రాష్ట్రంలో ఐదేళ్ల పరిణామాలను శాస్త్రీయ పద్ధతుల్లో క్షుణ్ణంగా, లోతుగా అధ్యయనం చేస్తే స్పష్టత ఏర్పడుతుంది.
2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిన ఆదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆరు నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 41.29 శాతం ఓట్లు తెచ్చుకుని 5.16 శాతం ఓట్లను కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీని, నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించారు. ‘కారు`సారు`పదహారు’ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన బీఆర్‌ఎస్ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోతూనే ఉంది. దుబ్బాకలో అధికార పార్టీ ఎమ్మెల్యే చనిపోయినా సానుభూతి పని చేయక ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే బీఆర్‌ఎస్ దుబ్బాకలో 16.54 శాతం ఓట్లను కోల్పోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరవాసులు బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఊహించని విధంగా సీట్లను కట్టబెట్టారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్‌ని పార్టీ నుంచి బయటకు పంపిన తీరు ప్రజలకు నచ్చలేదు. ఈటెల బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామ చేసి బీజేపీలో చేరడంతో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 18.96 శాతం ఓట్లను కోల్పోయి ఓటమి మూటగట్టుకుంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీన్మార్ మల్లన్న చేతిలో కన్ను లొట్టబోయినట్టు గట్టెక్కారు.
నాగర్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించినా అక్కడ కేవలం 0.72 శాతం ఓట్లను మాత్రమే పెంచుకోగలిగింది. రాజకీయ పార్టీల చదరంగంలో భాగంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలతో జతకట్టి గెలిచిన బీఆర్‌ఎస్ 12.12 శాతం ఓట్లను పెంచుకుంది. అయితే మునుగోడులో 2014లో సీపీఐకి 12.2 శాతం, సీపీఐ(ఎం)కు 5.36 శాతం ఓట్లు వచ్చాయనే గణాకాంలను పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికలలో కమ్యునిస్టులే ముఖ్యపాత్ర పోషించారని చెప్పవచ్చు.
రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తన ఎజెండా ఇంకా పూర్తి కాలేదని బీఆర్‌ఎస్ ‘గుడ్ టు గ్రేట్’ నినాదంతో ప్రచారం సాగిస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక నాయకుడు వరసగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు! హ్యాట్రిక్ గెలుపుతో చరిత్ర తిరగరాయలని కేసీఆర్ తీవ్రంగా యత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు నామినేషన్లు ప్రారంభమయ్యాక కూడా అభ్యర్థుల ఎంపికలో కుస్తీ పడితే కేసీఆర్ మాత్రం మితిమీరిన విశ్వాసంతో కేసీఆర్ ఆగస్టులోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అనేక సర్వేల్లో తేలినా కేసీఆర్ మళ్లీ వారికే అవకాశం ఇచ్చారు. అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడంతో మిగతా పార్టీలకంటే ముందే ప్రచారం మొదలుపెట్టే వెసులుబాటు బీఆర్‌ఎస్‌కు కలిగింది. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా పకడ్బంధిగా బూతు కమిటీలను నియమించి, ప్రతి కమిటీకి 100 ఓట్లను టార్గెట్‌గా పెట్టారు. నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను పెట్టి, ఎప్పటికప్పుడు పరిస్థితులను ట్రాక్ చేస్తూ పరిస్థితులను తమకు సానుకూలంగా మల్చుకోవడం బీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం.
దాదాపు పదేళ్లు అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది. దీనికి తోడు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని ప్రతిపక్షాలు ఆరోపణ బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం ఇబ్బందులను రెట్టింపు చేసింది.
బీఆర్‌ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న మరో వర్గం యువత! తాము లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ లెక్కలు చెప్తున్నప్పటికీ ఉద్యోగాలు రాలేదనే అసంతృప్తి యువతలో నెలకొంది. టీఎస్పీఎస్సీ కుంభకోణంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని, హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి ఇవలేదని బీఆర్‌ఎస్ పట్ల యువత ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలోని మూడు కోట్ల మంది ఓటర్లలో 35 ఏళ్ల లోపు ఓటర్లు 30 శాతానికి పైగా ఉన్నారు. అంటే సుమారు 90 లక్షల మంది యువత ఈ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపబోతున్నారు.
రైతు రుణ మాఫీలో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారనే అసంతృప్తి రైతుల్లో ఉంది. రైతుబంధు పేద రైతుల కంటే భూస్వాములకే మేలు చేస్తుందనే భావన కూడా బలపడింది. గత ఎన్నికల్లో రైతుబంధు గట్టెక్కిచ్చినట్టే, ఈసారి తన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని కేసీఆర్ ఆశాజనకంగా ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో సవాలు ఎదురవుతోంది. కాంగ్రెస్ గ్యారెంటీలనే బీఆర్‌ఎస్ కాపీ కొట్టిందనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో నెలకొంది.
ముఖ్యమంత్రి స్థానంపై కాంగ్రెస్ నాయకులలో ఉన్న కుమ్ములాటలు తమకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ వేసుకున్న అంచనాలు కూడా తప్పుతున్నాయి. కాంగ్రెస్ పుంజుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే కారణమని కొంతమంది జోస్యం చెప్తున్నా వాస్తవానికి కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం కలగడమే దానికి ప్రధాన కారణం. చెట్టుకు కాయలు ఉంటేనే కోసుకోవచ్చు అన్నట్టుగా ముందు అధికారంలోకి వస్తే చాలని కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉంటున్నారు. టికెట్ల పంపిణీలో, అసంతృప్తులను చల్లార్చడంలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. గత ఎన్నికల కంటే భిన్నంగా క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్‌కి అనుకూలంగా మాట్లాడటం, ఆ పార్టీకి మరింత బలం చేకూరుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తున్నట్టు వాతావరణం కనిపిస్తున్నా అది అధికార పగ్గాలను అందించగలదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, 2009, 2014, 2018 ఈ మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వరుసగా 52 స్థానాల్లో ఓడిపోయిన చరిత్ర ఉంది. వీటిలో కనీసం 30-35 స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదు. కొన్ని చోట్ల బీజేపీ, మరికొన్ని చోట్ల సీపీఎం, బీఎస్పీ అభ్యర్థులు బలంగా ఉండటంతో దాదాపు 25 నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ప్రత్యర్థి పార్టీ బలం, అభ్యర్థి కులం సమీకరణాల మీదనే ఆధారపడి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌కు నష్టం చేకూరవచ్చు. అంతేకాక బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌కి బలమైన బూత్ కమిటీలు లేవు. ఈ సవాళ్లలను కాంగ్రెస్ ఎలా పరిష్కరించుకుంటుందో అనే దానిపైనే ఆ పార్టీ విజయవకాశాలు ఆధారపడ్డాయి.
2018లో కేవలం 7 శాతం ఓట్లతో ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన బీజేపీ 2019 సాధారణ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకోవడం, ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలను గెలవడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీని వెనక్కినెట్టి రెండో స్థానంలోకి వచ్చింది. మునుగోడు ఉపఎన్నికల తర్వాత బీజేపీ అనేక సెల్ఫ్ గోల్స్ చేసుకోవడంతో పార్టీ నష్టపోయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాకపోవడం, ఈడీ విచారణ పేరుతో ఎపిసోడ్‌ను సాగదీయడంతో బీజేపీకి, బీఆర్‌ఎస్ ‘బీ’ టీమ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఆ మరకను చేరిపేయడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మడం లేదు.
బీజేపీ కేవలం మోదీ చరిష్మానే నమ్ముకుంటోంది. కర్నాటకలో ఓటమి తర్వాత దక్షిణ భారతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ రావొద్దనే లక్ష్యంతో బీజేపీ వ్యుహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌తో బీజేపీకి రహస్య ఒప్పందం కుదిరందన్న భావన బలపడింది. రాష్ట్రంలో 52 శాతం బీసీలు, 23 శాతం ఓసీలు, 15 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారు. వీరిలో ఎస్సీలు కాంగ్రెస్, బీఎస్పీ వైపు ఉంటున్నారు. వీరి ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. బీసీ ముఖ్యమంత్రి పేరిట, బీసీల ఓట్లను కూడా చీల్చే ప్రయత్నమూ చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు చివరగా ఉండేలా బీజేపీ అధిష్టానం జాగ్రత్తపడింది. కాంగ్రెస్‌కి నష్టం చేయడమే ఏకైక లక్ష్యంగా దండయాత్రలా ఈ వారమంతా పార్టీ జాతీయ నాయకులందరూ తెలంగాణలో పర్యటిస్తూ బీసీ, ఎస్సీ ఓట్లను చీల్చే ప్రయత్నాలు చేయబోతున్నారు. ఫలితంగా బీఆర్‌ఎస్‌కి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
గత రెండు ఎన్నికల తీరుతెన్నెలను గమనిస్తే కేసీఆర్ ఎప్పుడూ ఒక శత్రువును చూసుకుంటారు. 2014లో ఢిల్లీ పార్టీ అని కాంగ్రెస్‌పై మాటల దాడులు చేశారు. 2018లో చంద్రబాబును శత్రువుగా చేసి మరోసారి ఆంధ్రా వాళ్లకు తెలంగాణను తాకట్టు పెడదామా? అని భావోద్వేగాలు రెచ్చగొట్టారు. ఈసారి అలాంటి బలమైన శత్రువు కేసీఆర్ కి దొరకడం లేదు. గతేడాది టీఆర్‌ఎస్‌ని, బీఆర్‌ఎస్‌గా మార్చి తెలంగాణతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెంచుకోవడంతో సెంటిమెంట్ బలహీనపడింది. జాతీయ పార్టీ నినాదంతో ఇతర రాష్ట్రలో పోటీ చేస్తామని ప్రగల్బాలు పలుకుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఢిల్లీ పార్టీలని విమర్శిస్తే ప్రజలు సానుకూలంగా స్వీకరించలేకపోతున్నారు. ఇలాంటి అనేక పరిణామాల మధ్య గమ్యం చేరే దారిలో గుంతలు, అడ్డు కట్టలు కనపడుతున్నా బీఆర్‌ఎస్ కారుకి ఇంకా పంక్చర్ మాత్రం కాలేదు. అనేక ఇబ్బందులు పడుతున్న కారుకు మరమ్మతులు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు అభయహస్తం రిక్తహస్తం కాకుండా చూసుకుంటూ ముందుకెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగే ఫైనల్స్‌లో విజేత ఎవరో? డిసెంబర్ 3 న తేలుతుంది.
ప్రస్తుతం రాజకీయాలు కూడా టి-20 గా మారాయి. ఆఖరి 5 ఓవర్లలో ఎవరిది పై చేయి అవుతుందో వారే విజయం సాధిస్తారు. తెలంగాణ రాజకీయ రణరంగంలో రాబోవు 5 రోజుల్లో పోల్‌మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో ఎవరిది పై చేయి అయితే వారే విజేతలుగా నిలుస్తారు.
====================
– జి.మురళికృష్ణ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,