ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని కైవసం చేసుకోనున్నట్లు తేలింది . యూపీలో ఏడో విడత పోలింగ్ సోమవారం ముగిసిన వెంటనే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న ప్రకటించనున్నారు.
యూపీ.. యోగిదే!
దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ కూటమి మరోమారు అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా సీఎం యోగి మొదటి స్థానంలో నిలవగా.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. ప్రియాంకా గాంధీ, మాయావతి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.