AnonymousWriter: ఇరవై రెండేళ్లకే చేతిలో రెండేళ్ల బిడ్డతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది తను. గతం నుంచి బయటకి వచ్చి స్నేహితులూ, ప్రేమగా చూసే కుటుంబసభ్యులూ, బెస్ట్ ఫ్రెండ్‌లా ప్రవర్తించే బిడ్డ, దూరం నుంచి ఆరాధించే ఒకరిద్దరు అబ్బాయిలూ.. బాగానే వెళ్లిపోతుంది కాలం. ఆడ, మగ.. అందరిలోనూ అవకాశవాదులు ఉంటారని, మోసం ఒక జెండర్‌కే చెందిన లక్షణం కాదని తనకి బాగా తెలుసు. కానీ ఎందుకో ఎంతమంది ప్రపోజల్స్‌తో వచ్చినా ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు చాలా సంవత్సరాలు.
సంతోషాలని పంచుకోడానికి ఆమె సోషల్ మీడియాలో ఉండేది. అదీ చాలా తక్కువమంది స్నేహితులతో. అక్కడే అతను పరిచయం. అతనేమిటో పూర్తిగా తెలియకుండానే అతని మాటలకి ఆకర్షితురాలైంది. ఇద్దరికీ ఇష్టమైన ఒక మ్యూజికల్ షోకి అటెండ్ అయిన తర్వాత అతన్ని ప్రేమించింది. పెళ్లి అతనికి నచ్చని అంశం అని ముందు అన్నా తర్వాత తను లేకుండా బ్రతకలేను అన్నాడు. తన గతంలో పదుల సంఖ్యలో ఆడవారితో ఉన్న శారీరక సంబంధాల గురించి చెప్పుకుని,అది తను ఇష్టపడి చేసినది కాదని తన చిన్ననాటి విషాదాన్ని మరిచిపోడానికి తాగుడు, ఆడవాళ్లని ఎంచుకున్నానని చెప్పాడు. తన కోసం అతని గతంలోని విచ్చలవిడితనం అనే మురికిని కడుక్కొనే అవకాశాన్ని ఇవ్వమన్నాడు. ఆమె అతని నిజాయితీని నమ్మింది. నీతో గొప్ప ఫ్యూచర్ ఊహించుకుంటున్నా అన్నాడు. ముందే చెప్పింది ఆమె గతంలోని గాయాల గురించి. శారీరక గాయాలను తట్టుకోగలను కానీ మానసిక గాయాలు తట్టుకోలేను అనీ, ఇష్టం లేకపోతే మాట్లాడుకుని విడిపోదాం తప్ప, ఎప్పుడూ మోసం చేయవద్దు అని కన్నీళ్లతో చెప్పుకుంది. నుదుటి మీది ముద్దుతో “ఎప్పటికీ అలా జరగనివ్వను” అని మాటిచ్చాడు.
చదువు ఉద్యోగాలతో ఈ రోజుల్లో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులతో కడవరకూ ఉండరు కాబట్టి ప్రతీ ఒక్కరికీ ఒక తోడు అవసరం అని నమ్మేది తను. తన మనసుకి నచ్చిన తోడు దొరికినందుకు పొంగిపోయింది. కొన్నాళ్ళకు ఆమె సర్వస్వం అతనే అయిపోయాడు.
ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఒకరోజున అనుకోకుండా అతని ఫోన్ చూసింది. వేరే స్త్రీని సెక్స్ కోసం అభ్యర్థిస్తూ ఉన్న మెసేజ్లు. అది కూడా తనతో రోజుకి మూడుసార్లు కలిసిన రోజుల్లోనే అని తెలిసి షాక్‌కి గురైంది.
దేన్నైనా ఎదుర్కొని జీవితాన్ని ప్రేమించడం మాత్రమే తెలిసిన మనిషి ఆమె. గుండె బద్దలౌతున్నా పరిస్థితులను ఒప్పుకొని ముందుకు వెళ్లగలగడం తనకి స్వభావరీత్యా సగం వస్తే, అనుభవాలు మిగతా సగం నేర్పించాయి. మౌనంగా వెళ్లిపోయింది. అతను పశ్చాత్తాపంతో ఎన్నోసార్లు దగ్గరకి రాబోయాడు. తన ఇంటిపెద్దతో క్షమాపణలు పంపించాడు మావాడికి ఒక్క అవకాశం ఇవ్వమ్మా అంటూ. స్నేహితులు, కుటుంబసభ్యులు అందరికీ తన తప్పుని బాహాటంగా చెప్పుకున్నాడు. సోషల్‌మీడియాలో జరిగిన దాన్ని తక్కువ మ్యానిపులేషన్‌తో తన గోడ మీదే రాసుకున్నాడు ఆమెకు చేరాలని. అయినా ఆమె క్షమించలేదు.
ఇక్కడ కామెంట్ల గురించి మాట్లాడి తీరాలి. అదో ప్రహసనం. ”ఓస్! అదీ ఒక తప్పేనా?” అని ఒకరు.. “ఆ మాత్రం దానికేనా?” అని ఇంకొకరు…”ఆమెది ప్రేమేనా!” అని ఒక పెద్దావిడ… “నేనైతే క్షమించేస్తానని” ఒక యువతి…బుగ్గలు నొక్కుకుంటూ ఒక ముసలాయన. ఇదే పోస్ట్ ఒక ఆడదాని నుంచి వస్తే? అమ్మో! కామెంట్స్ ఊహించడానికే భయపడింది. చూసినా ఆమె మనసుకి స్పందించే శక్తి లేక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంది చాన్నాళ్లు. ఏ కారణంతో తను వివాహబంధం నుంచి బయటికి రావలసి వచ్చిందో మళ్లీ అదే చూసి ఒక విధమైన శూన్యతకి గురైంది.
కొన్నాళ్ళకు అతని ఫొటోలలో, స్నేహితుల ద్వారా తను క్షీణించడాన్ని చూసి బాధపడింది. ప్రతి మనిషీ తప్పు చేశాక ఒక అవకాశానికి అర్హుడు అని నమ్మేది ఆమె. అతని ఎన్నో పోస్టులలో ‘తను ఒక్క అవకాశం ఇవ్వాలే గానీ ఈ జన్మ తనకి అంకితం’ అని చెప్పుకున్న అతను మళ్లీ అలాంటి తప్పు చేయడు అని నమ్మి అతని కోసం మళ్లీ చేయి చాచింది.
తిరిగి వచ్చాక ప్రేమే లోకంగా కాలం గడుస్తూ ఉంది. త్వరలో పూర్తి కాబోతున్న ఆమెకున్న చిన్న చిన్న బాధ్యతల తర్వాత పెళ్లి చేసుకుని జీవించడమే ఊహించుకుంటూ సంతోషంగా ఉంది ఆమె. అతని కుటుంబసభ్యులు కూడా పెళ్లికి కంగారు పెడుతూనే ఉన్నారు.అతను ఆమెకు దగ్గరలోనే ఉంటూ తన క్వాలిటీ టైమ్ షేర్ చేస్తున్నాడు. ఆమె అతన్ని తన రెండో బిడ్డగానే చూస్తోంది చాలాకాలంగా. వండి తినిపించడం,అతని ఇంటిని తన ఇంటిగానే భావించి అతని కోసమే బతుకుతూ ఉంది. గిల్లికజ్జాలని కూడా ఇద్దరూ ఒకరినొకరు అర్థం
చేసుకునే అవకాశాలుగా మార్చుకొంటూ ప్రయాణిస్తున్నారు.
ఆడవారి పట్ల అతని ప్రవర్తన, చూపులపై తనకి ఉన్న అభ్యంతరాలని తెలియజేస్తూ అతన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అతను కూడా అంగీకరిస్తూ తనని తాను మెరుగుపరుచుకొనే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పేవాడు. ఆమె చూపు కోసమే పదేళ్ల నుండీ నిరీక్షిస్తున్న ఒక కుర్రాడికి “ఇతను నాకు కాబోయే భర్త” అని తనని పరిచయం చేసే వరకూ అతను ఒప్పుకోలేదు. ప్రేమలో పొసెసివ్నెస్ సహజం. కొంతవరకూ అందం కూడా అని ఆమెకు తెలుసు.
ఒకరోజు ఎందుకో ఒక స్త్రీ పట్ల సోషల్ మీడియాలో అతని అప్రోచ్ తేడాగా ఉండడం గమనించింది. అమ్మకోసం తను తీసుకున్న కొత్త నెంబర్‌తో అతనికి మెసేజ్ చేసింది. అతని ఉత్సాహం చూసి మొదట్లో కాస్త బాధపడినా నమ్మకం కోల్పోలేదు. లవర్లూ, ఎఫైర్లూ గురించి.. చాట్ ముదురుతోంది. మనసు ఎందుకో భయపడుతున్నా ఆ చాట్ ఆపాలని అనిపించలేదు ఆమెకి. ఎక్కడో ఒక్కచోట ఐనా తన గురించి చెప్పకపోతాడా అని ఆశ. ఆఖరికి చెప్పాడు..’ఎక్స్’తో బ్రేక్అప్ అయింది అని. పోనీలే.. ‘నీకు నమ్మకం వచ్చేదాకా పబ్లిక్ లో నువ్వు తిరిగి వచ్చావని ఎవరికీ చెప్పనులే’ అన్నాడు కదా! అందుకే చెప్పడం లేదు అనుకుంది.
రెండో రోజే తన ఊరు, వివరాలు అవీ చెప్పి కాస్త చనువుగా మాట్లాడింది. చనువు చూపిన రెండు నిమిషాలలోపే నీతో ఫిజికల్‌గా కలవాలని ఉందని అడిగాడు. “మరి నీ లవర్?” అని చాటింగ్‌లో అడిగితే, “నా హార్మోన్లకి అవేమీ తెలీడం లేదు. నా డిసైర్స్ కి ఆకాశమే హద్దు” అంటూ డీప్ కిస్‌ల గురించీ, సెక్స్ గురించీ చర్చ మొదలుపెట్టాడు. “నేను నచ్చానో లేదో చెప్పండి” అంటూ ఒక ఫొటో కూడా పెట్టాడు. ‘ఇంత దూరం రాగలరా’ అంటే దేశంలో ఏ మూలకైనా వస్తాను అన్నాడు. ఆడ, మగ కలయికకి దూరం ఒక భారమా అంటూ భావుకత ఒలకబోశాడు.
మళ్లీ మళ్లీ ‘నీకు నీ ఎక్స్ పట్ల ప్రేమ లేదా?’ అంటూ గుర్తు చేయడానికి తను చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇంక భరించలేకపోయింది.
బ్రేక్ ఇచ్చి తన ఒరిజినల్ నెంబర్‌తో మెసేజ్ పెట్టింది వాళ్లు ఎప్పుడూ కలిసే టీ షాప్‌కి రమ్మని. మొదట ఇప్పుడు రాలేను అన్నాడు. తన ప్రాణసమానమైన పుస్తకాలు కొన్ని అతని దగ్గర ఉన్నవి తిరిగి ఇమ్మని చెప్పి పిలిచింది. వచ్చాడు. “ఫొటోలో బాగున్నావు” అంది.
“ఏ ఫొటో?” అని అతను అడిగితే, అతను అప్పుడే పంపిన ఆ సెమీ న్యూడ్ పిక్చర్ చూపించింది. షాక్‌లో అతను ఉంటే శూన్యంలో తను ఉంది. ఏమీ మాట్లాడకుండా వెళ్లబోతున్న ఆమెని అడ్డుకోబోయాడు. శక్తి లేక కింద పడబోయింది. ఎప్పటిలాగే వెంటపడబోయిన అతన్ని “మళ్లీ నాకు మొహం చూపించి ఇంత జరిగినా కూడా నేను వెనక్కి వస్తాను అని నువ్వు అనుకుంటే, నాకు కనీస ఆత్మగౌరవం లేదని నువ్వు బలంగా నమ్ముతున్నట్టు. అది నువ్వు చేసిన మోసం కంటే నన్ను ఎక్కువ బాధపెడుతుంది” అని చెప్పి వెళ్లిపోయింది.
తనకి తెలుసు అతను మళ్లీ వస్తాడని, అతనికి ఆమెని సాధించడం ఒక కిక్ ఇస్తుందని. సాధించాక ఆమె భుజాల మీదుగా మిగతా అందాలను చూడడం మొదలుపెడతాడని. వచ్చాడు కానీ మాట్లాడడానికి అతని దగ్గర ఏముంది గనుక?
చివరికి కుక్క తోకకి తను కట్టిన ఆ బరువైన రాయిని తనే విప్పదీసింది. దాని స్వేచ్ఛని దానికి ఇవ్వడం ద్వారా తనని తాను కాపాడుకుంది. అతని కుటుంబానికి సందేశం పంపింది. విషయాన్ని చిన్నగా, తన నిర్ణయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పింది.
అతను తన సోషల్ మీడియా గోడ మీద యథావిధిగా సానుభూతి నాటకానికి రచన చేసే పనిలో ఉన్నాడు. ఆ రచన ఇలా మొదలవబోతుంది బహుశా.. ‘ప్రేమ దక్కని నేను ఇక ప్రేమకు అర్హుడిని కాను. ఆమె ఇన్ని సంవత్సరాల సమయంలో కూడా నన్ను క్షమించలేకపోయింది. ఇక మునుపటి జీవితానికే నేను వెనుతిరుగుతున్నాను…’
అతని సానుభూతిపరులు తమ కామెంట్ల కర్చీఫ్‌లు పట్టుకుని రెడీగా ఉంటారు. ‘ఆమెకి అర్హత లేదు ఇంత గొప్ప ప్రేమ పొందేందుకు’, ‘ఆమెది నిజమైన ప్రేమే అయితే క్షమించండం కష్టం కాదు’, ‘ప్రేమ ఆమె అంత క్రూరమైనది కాదు’, ‘ఆమెది అసలు ప్రేమే కాదు’, ‘నీ కోసం నీ మనసు తెలుసుకునే అమ్మాయి తప్పక వస్తుంది’.. ఇలా!