Telangana: బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చిచ్చు.. తెరపైకి ఉద్యమ కారులు…

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు  అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మీడియాలో కథనాలు రావడంతో కలవరం మొదలైంది.దీంతో ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమవేశాలు ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలాదన్నట్లు సీఎం కెసిఆర్ పై చాలా కాలంగా గుర్రుగా ఉన్న ఉద్యమ కారులు బీఆర్ఎస్ లో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు కెసిఆర్ కు దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇక జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అంశం అధికార బీఆర్ఎస్ లో చిచ్చు రాజేసింది.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్ రాదని.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి తోడు నియోజవర్గ మున్సిపల్ చైర్మన్ తో పాటు జడ్పీటిసిలు, ఎంపిటిసిలకు పెద్ద ఎత్తున పల్లా డబ్బు ఆఫర్ చేశాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అలెర్ట్ అయిన ముత్తిరెడ్డి మీడియా వేదికగా టికెట్ తనకే వస్తుందని అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ కష్టమనే అభిప్రాయం ఎమ్మెల్యే అభిమానుల్లో కనిపిస్తోంది.

మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ టికెట్ల కేటాయింపు, ఆశావహుల తిరుగుబాటు, టికెట్ రాదని  భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి  బీఆర్ఎస్ పార్టీలో అలజడి రేపుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతకి తోడు ఉద్యమ కారుల అంశం తెరమీదకు రావడం కేసిఆర్ కు మింగుడు పడటం లేదన్న చర్చ తెరమీదకి వచ్చింది. ఎన్నికల్లో వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రతి పక్షాలకు చెక్ పెట్టడంలో దిట్ట అయిన కేసిఆర్ ఈ అంశాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.

 

Optimized by Optimole