Nancharaiah merugumala senior journalist:
‘ఫోర్‌ప్లే’ లేకుండా చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా?
‘ తమిళ పాప్యులర్, కమర్షియల్ ’సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్ రామ్మోహన్ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో నాకు నచ్చిన విషయం చెప్పాడు. ఈ కులాల విషయంలో–‘‘ తమిళులు ఒకట్రెండు మూడు నాలుగడుగులు ముందున్నారు,’’ అని తనదైన స్టయిల్లో మా బాగా చెప్పాడు రామ్మోహన్. ప్రకాశం జిల్లా అవతరణకు ముందునాటి కర్నూలు జిల్లాలో కుటుంబ పునాదులున్న ఈ జర్నలిస్టు రాసిన పై మాటలు చదివాక నేను దెగ్గిర దెగ్గిర ఏడాది నుంచీ రాద్దామనుకున్న ప్రతిసారీ వెనకాడిన విషయాన్ని ఫేస్‌బుక్ పోస్టులో రాసి మిత్రులు ముందు పెట్టే ధైర్నం ఇప్పుడు నాకొచ్చింది. ‘ మహారాజా ’ లాగానే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ (2023) అనే తమిళ అనువాద తెలుగు సినిమాను ఇంట్లో ఓటీటీలోనే రెండేళ్ల క్రితం అనుకుంటా చూశా. తెలుగు నటుడు దివంగత రాజేష్ కూతురు,
నేను బాగా ఇష్టపడే ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో బ్రాహ్మణేతర (మాంసాహారం తినే) సాంప్రదాయ కుటుంబంలో గృహిణిగా నటించింది. ఎప్పుడూ ఇంటి పని విషయంలో తనను బాగా సతాయించే భర్త (రాహుల్ రవీంద్రన్) ఒక రోజు రాత్రి 10 గంటలు దాటాక, ‘‘ బాగా పొద్దుపోయింది. ఇక పడుకుందాం,’’ అంటూ తమ మంచం మీద నుంచే పడకగది లైటు తీస్తాడు. అప్పుడు వెంటనే ఐశ్యర్య, ‘ మీరు ‘ఫోర్‌ప్లే చేయకుండా చేస్తున్నారు. నాకు నొప్పిగా ఉంటోంది,’ అంటూ రెండేళ్లుగా తాను పడుతున్న శారీరక బాధ గురించి భర్తకు చెబుతుంది. ఇలా పగలైనా,రాత్రయినా అసలు ‘ఫోర్‌ప్లే’ గురించి మన తెలుగు సినిమాల్లో మాట్లాడే సందర్భం ఇంకో వందేళ్లయినా వస్తుందా? అంటే నాకైతే అనుమానం. ‘అసలు ప్లే’ గురించే సరిగ్గా చదువుకోని తెలుగోళ్లు ‘ఫోర్‌ప్లే’ గురించి పడకగదుల్లో అయినా ఇలా మాట్లాడడం కుదిరే పని కాదామో మరి! ఈ ఫోర్‌ప్లే అంటే హిందీలో చాలా పద్ధతిగా ‘సంభోగ్ పూర్వ్ క్రీడా’ అని ఇచ్చిన అర్ధం మాదిరిగా తెలుగులో నేరుగా గూగుల్ ఇవ్వలేకపోయింది.
మా కృష్ణా జిల్లా పామర్రు–ఉయ్యూరు బెల్టులోని రెండు గ్రామాల్లో మూలాలున్న వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఉషా చిలుకూరి వాన్స్ అమెరికాలో వచ్చే నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచి, 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా రెండోసారి 78 ఏళ్ల వయసులో ప్రమాణం చేశాక ‘అమెరికా సెకండ్ లేడీ’గా గుర్తింపు సాధించిన తర్వాత అయినా తెలుగు సాంప్రదాయ బ్రామ్మలు సహా సకల తెలుగు కులాల్లో సామాజిక మార్పులు వేగంగా వస్తాయని ఆశించడం తప్పుకాదేమో. అప్పుడు తెలుగు సినిమాల్లో ‘ఫోర్‌ప్లే’ గురించి మాట్లాడే సందర్భాలు రావచ్చేమో.