రాజీవ్‌ గాంధీని  ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist:

రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని ప్రశంసల వర్షం కురిపించింది. కొన్ని నెలల తర్వాత లోక్‌ సభ ఎన్నికల్లో ఇదివరికెన్నడూ లేని భారీ మెజారిటీతో (415) కాంగ్రెస్‌ గెలిచి, మరోసారి రాజీవ్‌ ప్రమాణం చేశాక ఆయనను అత్యధిక జనం ‘మిస్టర్‌ క్లీన్‌’ అనుకున్నారు. అలాగే పిలిచారు. దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు ఓ మైనారిటీ మతాన్ని లక్ష్యంగా చేసుకుని దానిపై భయంకరమైన దుష్ప్రచారం చేయడం మొదటిసారి జరిగింది.

 

1984 డిసెంబర్‌ ఎన్నికల్లో. రాజీవ్‌ అమ్మ ఇందిరాగాంధీపై తుపాకులతో ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కు పోలీసులు కాల్పులు జరిపిన పాపానికి మొత్తం సిక్కు మతస్తులను భారతీయులకు, ప్రధానంగా హిందువులకు హానికరమైన ‘జాతి’గా చిత్రించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా అయిన రాజీవ్‌ నేతృత్వంలోని పార్టీ నాటి దినపత్రికల్లో జనం ఓట్లడుగుతూ వేసిన ప్రకటనలు సాంప్రదాయ కాంగ్రెస్‌ అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఓ సిక్కు డ్రైవరు నడుపుతున్న ట్యాక్సీలో కూర్చున్న ప్రయాణికుని బొమ్మ వేసిన ఒక అడ్వర్‌టైజ్‌మెంట్లో–‘మీరు క్షేమంగా మీ ఇంటికి చేరుకుంటారా? మీరు భద్రంగా బతకాలంటే కాంగ్రెస్‌ పార్టీకే ఓటేయండి’ అంటూ పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. అంటే సిక్కులందరూ హంతకులు, ఉగ్రవాదులు అని హిందువులను భయపెట్టే పనిని కాంగ్రెస్‌ విజయవంతంగా చేయగలిగింది. ఈ ప్రకటనల విడుదలకు ముందు వాటిని చూసిన పీవీ నరసింహారావు, నారాయణ్‌ దత్‌ తివారీ వంటి సీనియర్‌ నేతలు ‘మనకెందుకులే ఈ గోల?’ అన్నట్టు నోరు మూసుకున్నారు. అలాగే పత్రికల్లో వేసిన మరో రెండు కాంగ్రెస్‌ ప్రకటనల్లో–‘ప్రతిపక్షాలు గెలిస్తే దేశ సరిహద్దు మీ గుమ్మం వరకూ వచ్చే ప్రమాదం ముంచుకొస్తుంది’, ‘1977 నాటి పార్టీల బృందం (జనతా పరివార్‌ పార్టీలు) ఈసారి అధికారంలోకి వస్తే దిల్లీ గద్దె కోసం ఆ పార్టీల నేతలు కాట్లాడుకుంటారు. ప్రధాని కుర్చీ నాలుగు కాళ్లూ విరగొట్టి కూర్చుంటారు, కాబట్టి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి దేశాన్ని కాపాడండి’ అంటూ  ప్రజలను బెదరగొట్టింది కాంగ్రెస్‌. ఇలా ‘కుహనా దేశభక్తి’ని, దేశభద్రతను ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకోవడం ఒక్క రాజీవ్‌ హయాంలోనే కాంగ్రెస్‌ అత్యంత జుగుప్సాకమైన రీతిలో చేయగలిగింది.

కాంగ్రెస్‌ నైతిక, సైద్ధాంతిక పతనానికి రాజీవ్‌ హయాంలోనే గట్టి పునాదులు…

కాంగ్రెస్‌ సైద్ధాంతిక, నైతిక పతనం రాజీవ్‌ సారథ్యంలో ఇక మొదలయినట్టేనని కాంగ్రెస్‌ పార్టీ శ్రేయోభిలాషులు వేసిన అంచనా రాజీవ్‌ ఐదేళ్ల పాలనలో నిజమేనని రుజువైంది. 1984లో రాజీవ్‌ ప్రధానిగా, పార్టీ నేతగా ఉండగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 415 వరకూ సీట్లు వచ్చాయి. ఐదేళ్ల అవినీతికర, పెత్తందారీ పోకడలతో నిండిన పాలన కారణంగా 1989 డిసెంబర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం 197కు దిగజారింది. ఆ తర్వాత జరిగిన 13 లోక్‌ సభ ఎన్నికల్లో దేంట్లోనూ కాంగ్రెస్‌ కు మెజారిటీ సీట్లు 272 దక్కలేదు. ఉన్నంతలో కాస్త ‘సెక్కులర్‌’ పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ ను పచ్చి మతతత్వ మార్గంలో నడిపిన రాజీవ్‌ గాంధీ గొప్ప పుణ్యం కట్టుకున్నారు. (1992 డిసెంబర్‌ నెలలో బాబరీ మసీదు నేలమట్టం కావడానికి పరోక్షంగా కారకులైన పీవీ నరసింహారావు గారు రాజీవ్‌ అజెండాను పూర్తి చేశారు.) 1985లో స్వీడన్‌ తో చేసుకున్న బోఫోర్స్‌ శతఘ్నుల ఒప్పందంలో భాగంగా ఈ కంపెనీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు రాజీవ్‌ పార్టీకి, ఆయన కుటుంబ సభ్యులకు అందాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన 1987–89 మధ్య కాలంలో ‘మిస్టర్‌ కరప్ట్‌’గా చెడ్డపేరు తెచ్చుకున్నారు. రాజీవ్‌ జీ ఈ ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు మింగారనే ఆరోపణ ఎంత విస్తృతంగా ప్రజలకు చేరిందంటే– 1987లో ఓ రోజు పట్నా ఆకాశవాణి కేంద్రంలో బాలల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా, ఓ పదేళ్ల లోపు బాలిక ‘గలీగలీ మే షోర్‌ హై–రాజీవ్‌ గాంధీ చోర్‌ హై’ (వీధివీధినా గోలగా ఉంది–రాజీవ్‌ గాంధీ దొంగ అని) అనే పాట పాడింది. అలా మిస్టర్‌ క్లీన్‌ గా మొదలైన రాజీవ్‌ గాంధీ చివరికి ముక్కుపచ్చలారని పిల్లలతో ‘చోర్‌’ అనిపించుకోవాల్సి వచ్చింది. తాత, తల్లి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రధానమంత్రి పదవిని సొంతం చేసుకున్నంత మాత్రాన వారి కుటుంబ వారసుడు ఎవరైనా తాను ‘యువరాజు’ను అని విర్రవీగితే– 1991 మే 21 రాత్రి తమిళనాడు శ్రీపెరంబుదూరులో జరిగిన పరిణామాలు వంటివి తప్పవని భారతీయులకు అర్ధమైంది.