Vikarabad:
పెళ్లికి ముందు ప్రేమ…తర్వాత పెళ్లి…భర్తకు అసలు విషయం తెలియడం విడాకులు… మళ్ళీ ప్రియుడి చెంతకు చివరాఖరికి ఒంటరి.మీరు వింటుంది సినిమా కథ కాదు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో వివాహిత ప్రేమగాథ. అసలు విషయానికొస్తే.. బెల్కటూరు గ్రామానికి చెందిన అక్షిత, అదే గ్రామానికి చెందిన సురేష్ మధ్య ప్రేమాయణం గత కొంతకాలంగా కొనసాగింది. అయితే, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో, అక్షితకు కర్ణాటకకు చెందిన మరో యువకుడితో వివాహం జరిపించారు.
వివాహం అనంతరం కూడా సురేష్ ఆమెను ఫోన్ ద్వారా వేధించటం ఆపలేదు. భార్యకు తరచూ అనామక కాల్స్ రావడం గమనించిన భర్త.. ఆమె సురేష్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త, సురేష్‌తో కలిసి హత్య చేస్తుందోమోనని భయంతో, పెద్దల సమక్షంలో అక్షితతో విడాకులు తీసుకున్నాడు.
తిరిగి గ్రామానికి వచ్చిన అక్షితను సురేష్ మరోసారి నమ్మించి దగ్గరయ్యాడు. అయితే ఇది కూడా తాత్కాలికమే. శారీరకంగా వాడుకున్న తరువాత మళ్లీ మొహం తిప్పేసాడు. అక్షిత పెళ్లి విషయాన్ని ప్రస్తావించగానే, సురేష్ మొఖం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.అక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.