APpolitics: జరగమంటే జరుగుతాడా, జగన్‌?

Nancharaiah merugumala senior journalist: 

‘ జరగమంటే జరుగుతాడా, జగన్‌? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ‘

‘ జరుగు జరుగు జగన్‌–ఖాళీ చెయ్యి కుర్చీ ’ ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్‌ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అసలు జరుగు, ఇక చాలు, జరగవయ్యా జగన్‌ అంటే జరిగేటోడేనా జగన్‌? ఖాళీ చేయ్యి అని అర్ధిస్తే పోయే మనిషేనా జగన్‌? ఇలాంటి నీరసపు ఎన్నికల నినాదాలను 2024 అసెంబ్లీ సమరంలో జనం మీదకు బాణాల్లా వదిలితే… జగన్‌ దాకా చంద్రబాబు ‘ సందేశం’ వెళుతుందా? ఇలాంటి నినాదాలను కిరీటంలా పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ద హిందూ వంటి పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇస్తే ఏం లాభం? జగన్‌ మాదిరిగానే కాంగ్రెస్‌ పార్టీ అండతో ఎదిగి చివరికి సీఎం పీఠమెక్కి ‘ గ్లోబల్‌ లీడర్‌ ’ గా పేరు సంపాదించిన చంద్రబాబుకు ఇప్పుడు ఏమైంది? క్రియాశీల రాజకీయాల్లో 1978 నుంచీ ఇప్పటి దాకా 46 ఏళ్ల అనుభం ఉన్న చంద్రబాబు పాత దూకుడు, పదునైన మెదడు ఎక్కడ దాగున్నాయి? 74 సంవత్సరాలు నిండాక కుప్పం ఎమ్మెల్యే .. ఇప్పుడు ఊహాతీతంగా మారిన ఎన్నికల రాజకీయాల్లో కాస్త కంగారుపడుతున్నట్టు కనిపిస్తోంది.

అఖిలాంధ్ర ప్రజానీకానికి అన్నగా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారి మూడో అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవిత చరమాంకం గందరగోళంగా ఇప్పుడు దర్శనమివ్వడం మా తరానికి అర్ధంకాని మిస్టరీగా ఉంది. హైదరాబాద్‌ లో ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాల 8 నెలలు తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ కష్టపడి సృష్టించుకున్నాడు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతుల పెద్ద కొడుకు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియో లిబరల్‌ ఆర్ధిక విధానాల విషయంలో రాజీపడకుండా పోరాడి చంద్రబాబు ఓడిపోయాడు. అయినా, ఆయన క్రెడిబిలిటీ లేదా విశ్వసనీయతకు బొక్కపడలేదు. 2004 మేలో ఏపీ కాంగ్రెస్‌ సీఎంగా గద్దెనెక్కిన డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి జనాకర్షక, ‘పేదల అనుకూల’ విధానాలతో బెంబేలెత్తిపోయిన టీడీపీ అధినేత వాగ్దానాలు, అజెండా ఐదేళ్ల తర్వాత జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ‘ ఈయన పాత హైటెక్‌ బాబేనా? అసలు ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ అనే సువిశాల కంపెనీ సీఈఓగా విశ్వవిఖ్యాతి సాధించిన నారా వారు ఐదు సంవత్సరాలు అధికారం లేకుంటే ఇంతగా నీరుగారిపోతారా?’ అని 1980ల మధ్యలో జర్నలిస్టులుగా కళ్లు తెరచిన మా తరానికి అనిపించింది. నిండు ఐదేళ్లు సీఎం కుర్చీలో హాయిగా కొనసాగిన తొలి కాంగ్రెస్‌ నేత వైఎస్సార్‌ కు రెప్లికా లేదా జిరాక్స్‌ కాపీలా బాబు గారు కనిపించారు. నానా శ్రమపడి 2009 ఎన్నికల్లో మహాకూటమి కట్టినాగాని వైఎస్సార్‌ అజెండా కాపీ కొట్టాడనే భావన నాటి ఏపీ ఓటర్లలో మనసుల్లో బలపడింది. చంద్రబాబు క్రెడిబిలిటీ పలచనవడం అప్పటి నుంచే మొదలైంది. చివరికి జనంలో ఈ పర్సెప్షనే టీడీపీ ఓటమికి దారితీసింది.

2014 అవశేషాంధ్ర ఎన్నికల్లో గెలుపు బాబుకే షాక్‌ ఇచ్చిన ‘దైవనిర్ణయమా’ ?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక మంది ఆం«ధ్రా నేతల మాదిరిగానే చాలా పిల్లిమొగ్గలు, యూటర్నులూ తీసుకున్నాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ‘ఎన్నటికీ తెలంగాణా రానే రాదు, మహాశక్తి ఇందిరాగాంధీయే ఏపీ విభజనకు ఒప్పుకోలేదు. అలాంటిది లోక్‌ సభలో 145 సీట్లతో యూపీఏ సంకీర్ణ సర్కారును వెనక సీటులో కూర్చుని ముందుకు డ్రైవ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే సాహసానికి ఒడిగడుతుందా?’ అనే పిచ్చి భ్రమల్లో ఆంధ్రా జనం ఉన్న రోజులవి. సైబరాబాద్, హైటెక్‌ సిటీ నిర్మాతగా, నిత్య శ్రామికుడిగా 1995–2004 మధ్య ఐటీ విప్లవం వెలుగులో గ్లోబల్‌ వేదికలపై నడయాడిన చంద్రబాబు వారికి హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. నవ్యాంధ్ర లేదా అవశేషాంధ్ర ‘నవ నిర్మాత’ మా బాగా పనికొస్తాడు బాబు అని టీడీపీకి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీప–బీజేపీ–కనిపించీ కనిపించని జనసేన కూటమికి ఆంధ్రా ఓటర్లు మెజారిటీ సీట్లిచ్చి చంద్రబాబును చివరిసారిగా ఏపీ సీఎంగా గద్దెనెక్కించారు. కృష్ణాతీరంలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాక ఆయనలో ప్రాచీనకాలం నాటి స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారిని కొందరు చూసుకున్నారు. నాలుగేళ్ల గందరగోళ పాలన నడిచాక జగన్‌ పాదయాత్ర ఊపుతో, ప్రత్యేక హోదా సాధన హోరుతో బెదిరిపోయిన బాబు గారు– 2018 వేసవిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.

2004 పరాజయం తర్వాత బీజేపీతో దోస్తీ ముగించడానికి సరైన కారణాలు చెప్పని బాబు 2014లో తిరిగి దానితో పొత్తుకు కూడా హేతుబద్ధమైన కారణాలు వెల్లడించలేదు. 2018లో నరేంద్ర మోదీ పార్టీతో కటీఫ్ కు సరైన వివరణ ఇవ్వనే లేదు. అలాగే 2024 ఎన్నికల ముందు మళ్లీ బీజేపీతో కూటమి కట్టడానికి కూడా తగిన కారణాలు వివరించలేకపోయారాయన. ఇలా ప్రతి కీలక మలుపులో చంద్రబాబు తన విశ్వసనీయతను పోగొట్టుకున్నారే గాని టీడీపీని బలోపేతం చేయలేకపోయారు. దాదాపు చంద్రబాబు వయసున్న బిహార్‌ జనతా పరివార్‌ నేతలు నితీశ్‌ కుమార్, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లు కూడా కాంగ్రెస్, బీజేపీతో కూటములు కట్టడం, మళ్లీ తెగతెంపులు చేసుకోవడం ద్వారా అనేక పిల్లిమొగ్గలు వేసినా వారు చంద్రబాబు మాదిరిగా క్రెడిబిలిటీని ఈ స్థాయిలో ఎన్నడూ పోగొట్టుకోలేదు. నితీశ్, లాలూలు 1970లో పట్నా యూనివర్సిటీ విద్యార్ధి రాజకీయాల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల రాజకీయాలు చక్కగా నేర్చుకున్నారు. మరి చంద్రగిరి చంద్రబాబు శ్రీవెంకటేశ్వరా విద్యార్ధి రాజకీయాల నుంచి ఏమి గ్రహించారో ఆ తిరపతెంకన్నకే ఎరుక.

tdp,janasena,bjp,

ఎన్ని దారులు మార్చినా నితీశ్, లాలూకు ఉన్న విశ్వసనీయత చంద్రబాబుకు ఉందా?

కాని మన తెలుగు నేతకూ, బిహారీ ఓబీసీ నేతల వ్యవహార శైలిలో ఎంత తేడా ఉందో చూడొచ్చు. బీజేపీతో పొత్తు, శత్రుత్వంతో వెంటవెంటనే రాజకీయ అడుగులు వేసిన నితీశ్‌ కుమార్‌ కు ఇప్పటికీ తగినంత మంచి పేరే మిగిలి ఉంది. మరి చంద్రబాబు ఈ మండు వేసవి జోడు ఎన్నికల్లో గెలవకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. 1950ల చివర్లో పుట్టిన మా తరానికి పాతికేళ్లు వచ్చే దాకా తెలుగునాట కాంగ్రెస్‌ పాలనే సాగింది. ఎప్పుడు పోతార్రా, ఈ నికృష్ట కాంగ్రెస్‌ పాలకులు అనుకునేవాళ్లం. 1977లో కేంద్రంలోనైనా కాంగ్రెస్‌ ఓడింది, ఇందిరమ్మే స్వయంగా రాయబరేలీలో ఓడింది గాని, అసలు ఆంధ్ర ప్రదేశ్‌ లో మనం బతికుండగా కాంగ్రెసేత ముఖ్యమంత్రిని, తొలి కమ్మ సీఎంను చూడగలమా? అనే ప్రశ్న 1980ల తొలి ఏళ్లలో మా వంటి కాంగ్రెస్‌ వ్యతిరేక ఆలోచనలున్న యువతరాన్ని పీడించింది. మా గుడివాడ టౌనకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని నిమ్మకూరులో పుట్టిన ఎన్‌.టి.రామారావు టీడీపీ స్థాపించి జనంలో తిరగడంతో మాకు పాతికేళ్లు నిండిన వెంటనే మా చిరకాల ఆకాంక్ష నెరవేరింది. తెలుగునాట కాంగ్రెస్‌ పార్టీకి నమ్మదగిన రాజకీయ ప్రత్యామ్నాయం ప్రజలకు దొకికింది. ఇక మళ్లీ టీడీపీ ఎన్నికల అడ్వర్టయిజ్మెంట్‌ విషయానికి వస్తే – ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న జగన్‌ ను ‘లేవయ్యా, జగన్‌’ అని జనం అనాలే గాని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిగా చంద్రబాబు అర్ధిస్తే.. ప్రయోజనం ఎవరికి? జగన్‌ జరగడానికి ఆయన కూసున్నది బెంచీనో లేదా సోఫానో కాదు. ఏమో మరి, కుర్చీలో కూర్చున్నోళ్లను ‘జరుగు, జరుగు’ అనే ధైర్యం ఒక్క చంద్రబాబు గారికే ఉన్నట్టుంది! 2009 ఎన్నికల్లో డా,వైఎస్‌ రా రెడ్డితో తలపడినప్పుడు కాంగ్రెస్‌ విధానాలను కాపీ కొట్టినట్టిన తీరులోనే 2024 ఎన్నికల్లో కూడా ఆయన కొడుకు జగన్‌ ‘సంక్షేమ నగదు బదిలీ’ అజెండాను పోలిన వాగ్దానాలతో ఆంధ్రా ఓటర్ల ముందుకు బీజేపీ, జనసేనతో జట్టుకట్టి వస్తే చంద్రబాబును జిత్తులమారి ఆంధ్రోళ్లు అందలం ఎక్కిస్తారా? ఏమో జూన్‌ 4 దాకా జవాబు కోసం ఆగితేనే మనకు మంచి కాలక్షేపం.