బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?

Nancharaiah merugumala senior journalist:

“జగన్‌ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్‌ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల ముందు రాజమహేద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. అవశేషాంధ్ర ప్రదేశ్‌ లో మరో ప్రాంతీయపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వంలోని నేర పరిశోధనా «శాఖ (సీఐడీ) పెట్టిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అవినీతి కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు 52 రోజులు జుడీషియల్‌ రిమాండులో ఉన్నారు. సాధారణ ఎన్నికలు ఇంకా ఆర్నెల్లు కూడా లేని సమయంలో తమ పార్టీ నేత జైల్లో ఉండడం తెలుగుదేశం పార్టీకి ఊపిరాడకుండా చేసింది. ఈ 52 రోజులు నారా వారి కుటుంబ సభ్యులకు 52 మాసాలు మాదిరిగా గడిచాయి.  ప్రపంచస్థాయి ఖ్యాతి ఉన్న నాయకుడు చంద్రబాబుపై ఓ రాష్ట్ర సర్కారు పరిధిలోని చిన్న పోలీసు విభాగం సీఐడీ నమోదు చేసిన కేసుతో సెంట్రల్‌ జైలులో నిర్బంధించడం ఆయనను అవమానించడమే. ఇప్పటికి పెద్ద ఆంధ్రప్రదేశ్, చిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్లు పని చేసిన టీడీపీ అగ్రనేతను 73 ఏళ్ల వయసులో కేవలం కొన్ని వందల కోట్ల అవినీతి కేసులో ఏపీ సర్కారు నిందితునిగా చేయడం– పాతిక ముప్పయేళ్ల క్రితం నిండు ఐదేళ్లు భారత ప్రధానిగా ఆర్థికసంస్కరణల అమలుతో దేశాన్ని కాపాడిన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు గారి చివరి రోజులను గుర్తుచేస్తోంది. 76–78 సంవత్సరాల వయసులో పీవీ కూడా అనేక అవినీతి, లంచం కేసుల్లో నిందితుడిగా సీబీఐ స్పెషల్‌ కోర్టుల చుట్టూ తిరిగారు. అయితే, ఆయన ఈ కేసులకు సంబంధించి జైలు జీవితం మాత్రం ఒక్క రోజూ గడపలేదు.

జగన్‌ 16 నెలలు గడిపింది చంచలగూడ జైల్లో మెరుగైన సౌకర్యాల మధ్యే కదా!

ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2011లో కాంగ్రెస్‌ నుంచి వైదొలిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ పెట్టి 2012 మేలో ఉమ్మడి ఏపీలో రెండు లోక్‌ సభ, 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌పై కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చెప్పుచేతల్లోని కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) పదికి పైగా కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నీ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అభియోగాలపై పెట్టినవే. ఈ కేసులకు సంబంధించి 2012 మేలో అరెస్టు చేసి చంచలగూడ జైలుకు తరలించినప్పుడు జగన్‌ నివాసం జూబిలీ హిల్స్‌లోని లోటస్‌ కాంపౌండులో ఉండేది. సొంతింటికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని చంచలగూడ సెంట్రల్‌ ప్రిజన్‌కు పోవడం ఆయనకు పెద్ద ఇబ్బందికరమైన అనుభవం కాదు.  మొన్నటి ‘అత్యంత బాధాకరమైన’ చంద్రబాబు రాజమండ్రి జైలు నిర్బంధంతో పోల్చితే జగన్‌ రిమాండ్‌ అంత పెయిన్‌ ఫుల్‌ కాదేమో. ఎందుకంటే, జగన్‌ 39 ఏళ్ల ఆరు నెలల వయసులో జైలుకు పోయి దాదాపు 16 నెలల నిర్బంధం తర్వాత 40 ఏళ్ల 9 నెలల వయసులో విడుదలయ్యారు. ఏడాది నాలుగు నెలల జైలు జీవితం పులివెందులలో కుటుంబ పునాదులున్న నాటి యువనేతను ‘భరించలేని స్థితికి’ పోకుండా ఆయన వయసే కాపాడింది. అదీగాక, కడప జిల్లాకు చెందిన నాటి ఎంపీ జైలులో నెలలకు నెలలు గడిపినప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కేసులను బాగా అర్ధంచేసున్న బడా వకీలు పి.చిదంబరం కేంద్ర హోంమంత్రి ఉండగా (2008 నవబంర్‌–2012 జులై) అరెస్టు కావడం జగన్‌ను కుంగదీసిన అంశమేగాని ఈ ‘వర్ధమాన నేత’ను కుదేలయ్యేలా అది చేయలేకపోయింది అవినీతిని అంతమొందించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి, నెహ్రూ–గాంధీ కుటుంబానికి పట్టుదల ఎంత ఉంటుందో భారతీయుకు ఎరుకే.  కేవలం కక్ష సాధింపుతో, కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌ సీఎంగా అసెంబ్లీ పదవీకాలం చివరి వరకూ (2014 వేసవి వరకూ) పదవీలో కొనసాగించే రాజకీయ లక్ష్యంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం (కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, యూపీఏ నాయకురాలు సోనియాగాంధీ, కొడుకు రాహుల్‌ గాంధీ) జగన్‌ ను జైలుకు పంపిందనే విషయం కూడా తెలివిలేని తెలుగోళ్లకు కూడా  తెలుసు.

జగన్‌ నిర్బంధంలో ఉండగా చంచలగూడ జైలు ‘ఆధునికీకరణ’, మెరుగైన సౌకర్యాలు

జగన్‌ నిర్బంధంలో ఉండగానే చంచలగూడ జైలులో సౌకర్యాలు మెరుగుపరిచి దాన్ని ‘ఆధునికీకరించే’ కార్యక్రమం మొదలైంది. కేంద్ర సర్కారు చేతిలో కీలుబొమ్మగా పనిచేసే సీబీఐ ఎడాపెడా పెట్టిన కేసుల ఫలితంగా తన జీవితంలో ఎంతో విలువైన 16 నెలలు హైదరాబాద్‌ పాత బస్తీ జైలులో గడిచిపోయినా, జగన్‌కు హైదరాబాద్‌ నిర్బంధం ఓ పండగలా సాగకపోయినా, ఎన్నో ‘పోరాటాలకు’ సిద్ధం చేసింది. చంద్రబాబు గారి (ఆయన హయాంలో నిర్మించిన భవనం) గోదావరి కారాగారంలో పోల్చితే గ్లోబల్‌ సిటీ హైదరాబాద్‌ జైలు యెడుగూరి సందింటి నేతకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. వయసుకు వయసు, సౌకర్యాలకు సౌకర్యాలు కడప జిల్లా నేతకు సానుకూలంగా మారాయి. మరి, చిత్తూరు జిల్లాలో తన సొంతూరు అంతర్భాగంగా ఉన్న చంద్రగిరి స్థానం నుంచి ఒకసారి అసెంబ్లీకి గెలిచి, రెండోసారి ఓడిపోయిన చంద్రబాబు గారికి రాజకీయ, అధికార సౌఖ్యాలతోపాటు కష్టాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. తనకు పెళ్లయిన ఏడాదికే–అది కూడా కాంగ్రెస్‌ సీఎం భవనం వెంకట్రామరెడ్డి కేబినెట్‌లో సహాయ మంత్రిగా ఉండగా మామ ఎన్‌.టి.రామరావు తెలుగుదేశం స్థాపించడం, ఏడాది తర్వాత సొంత చంద్రగిరిలో మామగారి పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామ నాయుడు గారి చేతిలో ఓడిపోవడం, 1983 ఓటమి తర్వాత 1989 డిసెంబర్‌ వరకూ ఏ చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం లేకపోవడం చంద్రబాబు గారి మనసును ‘బాధించిన’ వాస్తవాలు. అన్నిటికీ మించి తన సొంతూరు నారావారి పల్లె ఉన్న చంద్రగరి వదిలి దూరంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని కుప్పం నుంచి అసెంబ్లీకి రెండోసారి ఎన్నికవ్వడం, ఇప్పటికీ అదే ఆయన సొంత ‘నియోజకవర్గం’ కావడం కూడా ‘గ్లోబల్‌ విజన్‌’ ఉన్న బాబు గారికి గర్వకారణమైన వాస్తవాలు కాదు. ఏదేమైనా పదేళ్ల క్రితం నాలుగు పదులు నిండకుండా జగన్‌ మోహన్‌ రెడ్డి 450 ఏళ్ల చరిత్ర ఉన్న గ్లోబల్‌ సిటీలోని సెంట్రల్‌ జైల్లో 16 నెలలు గడిపారు. ఈ కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆరు నెలలకు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మొత్తం 175 సీట్లకుగాను 67 స్థానాలు కైవసం చేసుకుంది. కాని సాధారణ మెజారిటీకి ఇంకా 21 సీట్లు తక్కువ కాబట్టి జగన్‌ ది పరాజయమే. ఏడాదికి పైగా సాగిన చంచలగూడ నిర్బంధం 67 స్థానాలు గెలవడానికి మాత్రమే ఆయనకు తోడ్పడింది! మరి 73 ఏళ్ల ఆర్నెల్ల వయసులో నిండా రెండు నెలలు కూడా నిండని చంద్రబాబు గారి జ్యుడీషియల్‌ నిర్బంధం 2024 వేసవి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 52 సీట్లను తెచ్చిపెడుతుందా? లేక జగన్‌ పార్టీ పదేళ్ల క్రితం సాధించిన  67 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చుతుందా? అనేది తెలుగువారి ఆత్మ గౌరవం మొదటిసారి గుర్తుచేసిన అప్పటి ఆరు కోట్ల తెలుగు జనం అన్న ఎన్టీఆర్‌ స్థాపించిన ప్రాంతీయపక్షం నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న విషయం. ఈ ఇద్దరు ‘ఆంధ్రా భాగ్య విధాతల’ నిర్బంధాలను పోల్చినప్పుడు గుర్తుచ్చే మరో ముఖ్య విషయం ఏమంటే–æజగన్‌ జైలు నుంచి రావడానికి దాదాపు రెండు నెలల ముందు (2013 జులై 30న) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయాన్ని నాటి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ–కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించింది. చంద్రబాబు రాజమహేంద్రి జైలులో ఉండగా తెలుగునాట, దేశంలో కీలక పరిణామాలేవీ జరగలేదు. కాని, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌–గాజా పట్టీలో మంటలు మొదలయ్యాయి. ఉత్తర్‌ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే మాట్లాడని చంద్రబాబుకు గతంలో మాదిరిగా అంతర్జాతీయ పరిణామాలపై వ్యాఖ్యానించే రాజకీయ ఓపిక ఇప్పుడు లేదు.

Related Articles

Latest Articles

Optimized by Optimole