Movie review:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “మా ఇంటి బంగారం” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ డ్రామాకు హీరోయిక్ టచ్ జోడించి దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? సమంత ఖాతాలో మరో హిట్ పడిందా? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
90వ దశకంలోని రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం కథ స్వర్ణ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. తన ప్రేమికుడు అనిరుధ్‌ను కుటుంబ పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకుని ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన స్వర్ణ… అక్కడ ఎదుర్కొనే పరిస్థితులు, కుటుంబంలో తన స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం, అలాగే ఆమె గతంలో దాగి ఉన్న రహస్యాల చుట్టూనే కథ సాగుతుంది.
ఎలా ఉందంటే..
సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. పల్లెటూరి వాతావరణం, ఉమ్మడి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలు, హాస్యభరిత సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుటుంబ బంధాలను చూపించిన విధానం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది.
అయితే సెకండ్ హాఫ్‌లో కథనం కొంత బలహీనపడుతుంది. స్వర్ణ గతానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు, విలన్ ట్రాక్, కీలక ట్విస్టులు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి. కథ ముందే ఊహించదగిన విధంగా సాగడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది.
ఎవరెలా చేశారంటే…
ఇక నటీనటుల విషయానికి వస్తే… సమంత మరోసారి తన నటనతో సినిమాను భుజాలపై మోసింది. భావోద్వేగ సన్నివేశాలు, కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్లలో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దిగంత్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ పెద్దగా స్కోప్ దక్కలేదు. గుల్షన్ దేవయ్య పాత్ర కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
సాంకేతిక విభాగంలో సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ రాయలసీమ గ్రామీణ అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. దర్శకురాలు నందిని రెడ్డి వినోదాత్మక సన్నివేశాల్లో మెప్పించినా, కథలో కొత్తదనం చూపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
మొత్తంగా మా ఇంటి బంగారం గొప్ప కథనంతో కాకుండా సమంత పెర్ఫార్మెన్స్తో నిలిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. భారీ అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: ⭐ 2.75 / 5.
