ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?

Nancharaiah merugumala (senior journalist)

రాహుల్‌ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్‌ 52 ఏళ్ల బ్యాచిలర్‌ పై అనర్హత వేటు వేయించారా?

కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు అంటే 2018 జులై 21న రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి ఉన్నారు. అన్ని విధాలా, అన్ని పనులకూ అనుకూలంగా ఉండే తెల్ల టీషర్టు, నల్ల ట్రౌజర్స్‌ వేసుకోవడం ఆయనకు ఈమధ్యనే అలవాటయింది. తన ప్రసంగం ముగించిన రాహుల్‌ బాబా బీజేపీ తనకు పప్పూ అని ముద్రేసినా, ద్వేషించినా తాను ‘ప్రేమ’నే పంచుతానని ధైర్యంగా ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ప్రధానిపై తనకున్న ప్రేమను ప్రపంచ ప్రజలకు చూపించడానికి తాను స్వయంగా ప్రధాని నరేంద్ర డీ మోదీ కూసున్న చోటుకు వెళ్లారు. తన స్థానంలో కూర్చున్న మోదీని తాను మాత్రం వంగి రాహుల్‌ భయ్యా కావిలించుకున్నారు. అదే ఏకపక్షంగా, బలవంతంగా కుటుంబ సభ్యుల బాదరబందీ లేని గుజరాతీ తేలీ ప్రధానిని ఆలింగనం చేసుకున్నారు. ప్రశాంతంగా కూర్చుని ఉన్న తనను రాహుల్‌ అలా చేయడంతో ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తర్వాత రాహుల్‌ జీ చెప్పినట్టు–‘నరేంద్ర భాయ్‌ కళ్లల్లో’ ఆక్షణాన భయం కనిపించింది. రాహుల్‌ జీ కళ్లల్లో మాత్రం 18 సంవత్సరాల క్రితం నాటి ‘సూరి బావ కన్నుల నుంచి ఉప్పొంగిన ఆనందం’ దర్శనమిచ్చింది. ఆరోజు రాహుల్‌ మాటల్లో, చేతల్లో విజయోత్సాహాలు కనిపించాయి. కనీసం గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేని కాంగ్రెస్‌ అధ్యక్షుడి మాటలకు 140 కోట్ల జనాభా ఉన్న భారత ప్రధాని భయపడాలి. విపక్ష నేత విమర్శల్లోని విషయాలను గమనించాలి. అంతేగాని రాహుల్‌ భాయ్‌ బలవంతపు కౌగిలింతకు అంతగా ప్రధాని మోదీ భయపడిపోయారంటే జనం ఏమనుకోవాలి? అందుకే, 2024 లోక్‌ సభ ఎన్నికలకు కూడా ఏడాది ముందు అంటే వచ్చే జులైలో తనను నిండు లోకసభలో ఎక్కడ రాహుల్‌ గాంధీ వచ్చి కావిలించుకుంటారోననే భయం మోదీజీని వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.

అందుకే రాహుల్‌ బలవంతపు, ఏకపక్ష కౌగిలింత ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ యువనేతపై అనర్హత వేటు అంత హడావుడిగా రాజస్థానీ వైశ్య కుటుంబంలో పుట్టిన సౌమ్యుడైన లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిడ్లాతో వేయించారు. కాబట్టి ప్రస్తుతానికి నరేంద్రమోదీకి రాహుల్‌ నుంచి ఆలింగనం ముప్పు తప్పినట్టేనని అనుకోవచ్చు. ఇక అంతా సుప్రీంకోర్టు దయ. భారత కాషాయ ప్రధానమంత్రికి అడక్కుండా ఇచ్చిన ఒక్క కౌగిలింతకు తాను లోక్‌ సభ సభ్యత్వం రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సివచ్చినందుకు రాహుల్‌ గాంధీకి నిజంగా చాలా బాధనిపిస్తోంది. ఒకప్పటి మణిశంకర్‌ అయ్యర్‌ పాత్ర ఇప్పుడు చక్కగా పోషిస్తున్న మరో తమిళ బ్రాహ్మణ మేధావి, రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేష్‌ వంటి భజనపరుల వల్ల రాహుల్‌ కు నష్టమేగాని ప్రయోజనం లేదని రుజువవుతోంది.

Optimized by Optimole