నానాటికీ పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

ద‌శాబ్దాలుగా దేశాన్ని ఏలిన  కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి ? ఆపార్టీకి ఎంత‌మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 2024  లోక్ సభ ఎన్నిక‌ల‌కు సెమిఫైన‌ల్  భావించే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ,మిజోరం ఎన్నిక‌ల్లో ఆపార్టీ  ఏ మేర ప్ర‌భావం చూప‌నుంది?  భార‌త్ జోడో యాత్రలో క‌నిపించిన హ‌స్తం వేవ్ .. రానున్న ఎన్నిక‌ల్లో  ఎంత‌మేర లాభంచేకూరే  అవ‌కాశ‌ముంది?  రాజస్థాన్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటుందా?

దేశ‌వ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 660 మంది  ఎమ్మెల్యేలు ఉన్నారు. సీట్ల శాతం 16.36 శాతంగా ఉంది. అత్య‌ధికంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఆపార్టీకి 101 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రాష్ట్రాలుగా.. ఏపీ,ఢిల్లీ, నాగాలాండ్‌, సిక్కిం  ఉన్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ,గోవా, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, మిజోరం, ఒరిస్సా, పాండిచ్చేరి, తెలంగాణ, త్రిపుర , ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో ఆపార్టీకి సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌, నాగాలాండ్‌, సిక్కిం.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒక్క‌రంటే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా లేరు. ద‌శాబ్దాలుగా దేశాన్ని ఏలిన హ‌స్తం పార్టీ.. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ లేని విధంగా తీవ్ర రాజ‌కీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.

ఇక 2024 ఎల‌క్ష‌న్ స‌మరానికి సెమిఫైన‌ల్ గా భావించే ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు హ‌స్తం పార్టీకి చావోరేవో స‌మ‌స్య‌గా మారింది.  హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి రావ‌డం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఊహించని రీతిలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌డం వంటి అంశాలు ..త్వ‌ర‌లో ఎన్నిక‌లు  జ‌ర‌గ‌బోయే రాష్ట్రాల్లో ఆపార్టీకి క‌లిసొస్తుంద‌ని హ‌స్తం పార్టీ నేత‌లు ధీమాగా క‌నిపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. సొంతంగా అధికారంలోకి వ‌చ్చిన మ‌ధ్యప్ర‌దేశ్‌ , రాజస్థాన్‌, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారం నిల‌బెట్టుకోవాల‌ని హ‌స్తం పార్టీ ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తోంది.  పార్టీ సీనియ‌ర్ ,జూనియ‌ర్  నేత‌ల వ‌ర్గ‌ పోరుతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చేజేతులా అధికారాన్ని కోల్పోయిన‌ప్ప‌టికి.. ఈసారి ఆ త‌ప్పిదం జ‌ర‌గకుండా నేత‌లు ఇప్ప‌టినుంచే వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. 

కర్ణాటకలో పాగా వేసేందుకు వ్యూహం..

2023లో ఎన్నికలు జరగనున్న కీలక రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. 224 మంది సభ్యుల కర్ణాటక శాసనసభ పదవీకాలం మే 24తో ముగుస్తుంది . ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఇక్క‌డ హంగ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని పీపుల్స్ పల్స్ రీసెర్చ్  సంస్థ‌ సర్వే రిపొర్టును వెల్లడించింది. క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌స్తే .. ఆప్ర‌భావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఉంటుంది. దీంతో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అస్త్ర శ‌స్త్రాల‌ను ప్ర‌యోగించి పాగా  వేయాల‌ని హ‌స్తం పార్టీ దృడ నిశ్చ‌యంతో క‌నిపిస్తోంది.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole