కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

Nancharaiah merugumala: ( senior journalist)

సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే

కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు కొత్తమే కాదు. కోట వంటి 75 ఏళ్ల నటుడు కన్నుమూశారని ప్రచారం చేస్తే ఆయన చెప్పినట్టు ఎవరికీ డబ్బులు రావు. బుర్ర తక్కువున్నోళ్లు ఎక్కువ ఉన్న తెలుగునాట పుకార్లు చెలామణిలో పెట్టేవారికి ఊరికే ఎవరూ పైసలివ్వరు. మరి, కోట ఎందుకీ మాట అన్నారో తెలియదు. కిందటేడాది తెలుగునటీనటుల సంఘం ‘మా’ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ టీవీ చానల్‌ విలేఖరికి కోట శ్రీనివాసరావు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, ‘‘ తెలుగు సినిమాల్లో తెలుగు రాని సాయాజీ శిందే వంటి ఇతర భాషలు మాట్లాడే, ఇతర రాష్ట్రాలకు చెందిన నటులకు ఈమధ్య విలన్, కేరక్టర్‌ పాత్రలు ఇవ్వడానికి నిర్మాతలు తెగ ఉబలాటపడుతున్నారు. మా వంటి అసలు సిసలు తెలుగు నటులను మర్చిపోయి ఇలా ఇతర భాషల వారికి అవకాశాలు ఇవ్వడం సబబు కాదు,’ అంటూ కోట ఆక్రోశంతో మిళితమైన తన కడుపు మంటను వెళ్లగక్కారు. కోట ఇప్పటి వరకూ 700కు పైగా సినిమాల్లో నటించారు. వాటిలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలు ఉన్నాయట. తాను ‘బాగా ఫైల్లో, రైజులో’ ఉన్న రోజుల్లో ఎన్నెన్ని తెలుగు, ఇతర భాషల సినిమాల్లోనైనా నటించవచ్చని కోట భావించారు. కాలూచేయీ, కన్నూ చెవులూ బాగా పనిచేసినప్పుడు, తనకు తెలుగు సినిమాల్లో విపరీతంగా అవకాశాలు వచ్చినప్పుడు సాయాజీ శిందే వంటి ‘పరభాషా నటుల’ తెలుగురంగ ప్రవేశం కోట గారికి తప్పనిపించలేదు. ఇప్పుడు అవకాశాలు మందగించిన సమయంలో తెలుగురాని ఈ పొరుగు రాష్ట్రాల ఆర్టిస్టులకు ఎలా అవకాశాలిస్తారని ఆయన ప్రశ్నించడం చాలా బాగోలేదు. సాయాజీ శిందే తెలుగులో నటించడం ఏంటని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఓ నటుడిగా చనిపోయాడని చాలా మంది తెలుగు నిర్మాతలు భావించారు.

ఎస్పీ బాలుదీ ఇదే ఏడుపు!

కోట శ్రీనివాసరావులాగానే (కృష్ణాజిల్లా కంకిపాడు) మరో కోస్తా జిల్లా నెల్లూరులో పుట్టిపెరిగిన గాయక నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 2020 సెప్టెంబర్‌ 25న ఎస్పీబీ దురదృష్టవశాత్తూ కొవిడ్‌–19తో మరణించారు. ఈ ఇద్దరూ హిందూ సాంప్రదాయ కుటుంబాల్లో జన్మించారు. స్వాతంత్య్రం రాకముందు దాదాపు ఒకే కాలంలో పుట్టారు. ఎస్పీ 1946లో, కోట 1947లో. ఐదారేళ్ల కిత్రం ఎస్పీ బాలు ఈటీవీ ‘పాడుతా తీయగా’ అనే పాటల కార్యక్రంలో పాల్గొన్న ఓ సందర్భం నాకింకా గుర్తుంది. అప్పుడు ఈ గానగంధర్వుడు– పాటపాడటానికి తన ముందుకొచ్చిన ఓ కుర్రాడిని, ‘ ఏం పాట పాడతావు, కన్నా?’ అని ప్రశ్నించారు. ‘గోవిందుడు అందరివాడేలే’లోని ‘‘గులాబీ కళ్లు రెండు ముళ్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే’’ అనే పాట పాడతాను, సర్‌’ అని ఆ టీనేజి అబ్బాయి జవాబిచ్చాడు. దాంతో, ‘‘ఈ పాట తెలుగులో పాడింది మనకు నోరు తిరగని పేరున్న హిందీ సింగర్‌ కదా!’ అంటూ బాల సుబ్రహ్మణ్యం గారు కాస్త ఏడుపుతో నిండిన నవ్వు మొహంతో అన్నారు. అవునని ఆ బాలుడు బాధతోనే తలూపాడు. వాస్తవానికి ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ నోట నుంచి వినిపించిన ఈ పాట పాడింది– ప్రఖ్యాత హిందీ పాప్యులర్‌ సింగర్‌ జావేద్‌ అలీ. పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పుట్టిపెరిగిన ఈ యువ గాయకుడి పేరు తెలుగులో పలకడం చాలా తేలిక. బాలూ చెప్పినంత కష్టమైన పేరు కానే కాదు. అనేక ఇతర భాషా చిత్రాల్లో పాడిన ఆయనకు జావేద్‌ అలీ వంటి ‘పరభాషా’ గాయకులు తెలుగులో అడపాతడపా పాడితే 70 ఏళ్లు అప్పటికే దాటిన ఎస్పీబీ వంటి ఘరానా గాయకుడికి పోయేదేమిటో అర్ధంకాదు. అదీగాక, ఈ గులాబీ కళ్ల పాటను జావేద్‌ అలీ చక్కగా తెలుగోడిలాగానే పాడాడు. ఆరోగ్యం కాస్త చెడిపోయి, వయసు మీదపడుతున్నప్పుడు ఇతర భాషల కళాకారులను ఇలా కించపరచడం కోట, బాలు వంటి పెద్ద కుటుంబాల్లో పుట్టిపెరిగిన ప్రముఖులకు తగని పని. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ‘వీరు ఇంకా ఎందుకు బతికున్నారు? ఇలాంటి పాడు మాటలు పబ్లిగ్గా చెప్పడానికా?’ అనే అనుమానం వస్తుంది.

You May Have Missed

Optimized by Optimole