రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది.
కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆదివారం నుంచి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నిక రావాలని భావిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పార్టీ మార్పుపై వివిధ మండలాల నేతల అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిపారు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నట్లు రాజగోపాల్ పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ తో చర్చలకు సీనియర్ నేతలు ఉత్తమ్, వంశీచందర్ ద్వారా కబురు పంపింది. పార్టీ మార్పు పై తొందరపడ్డొదని.. చర్చించేందుకు ఢిల్లీకి రావాలని రాహుల్ ఆహ్వానం పంపినట్లు తెలిపింది. అయితే ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్లేందుకు విముఖుత చూపినట్లు.. దీంతో చేసేదేమిలేక సీనియర్ నేతలు వెనుదిరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజగోపాల్ నియోజకవర్గ పర్యటనపై జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన వ్యూహాంలో భాగమని నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్ అసంతృప్త నేతలను ఆహ్వానించేందుకు.. పర్యటన సరైన వేదికగా ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే విషయంపై తొందరపడొద్దని.. రాజగోపాల్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.