BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?

Nancharaiah merugumala senior journalist:

” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?”

హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్‌ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది అత్యంత తెలివైన నరేంద్ర మోదీ ప్రభుత్వం. బాబరీ మసీదు కూల్చివేతకు కారకుడయ్యి దేశంలోని కోట్లాదిమంది ముస్లింలు, లౌకిక ప్రజాతంత్ర సిద్ధాంతాలు నమ్మిన వారి మనసులు గాయపరిచిన నరసింహారావు గారికి విడిగా భారత రత్న ప్రకటించడం ఎంత కాషాయాంబరధారి అయినా నరేంద్ర భాయ్‌కి ఇబ్బందికర సమస్యగా ఉండేది. అందుకే ఇద్దరు ఉత్తర, దక్షిణ ప్రముఖుల పేర్ల మధ్యన పాములపర్తి వారి నామాన్ని చేర్చి మరీ భారత అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించారు. ఏదేమైనా తెలంగాణ సకల బ్రాహ్మణ సమాజానికి ఇంతటి సంతోషకరమైన రోజు మరొకటి ఉండదేమో. గతంలో 2021లో టీఆరెస్‌ తరఫున కేసీఆర్‌ మద్దతుతో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన పీవీ చిన్న కూతురు సురభి వాణీ దేవికి ఇప్పుడు తన అక్క కొడుకు నచ్చరాజు వెంకట సుభాష్‌ రావు దారిలో ముందుకుపోయి బీజేపీలో చేరడానికి మార్గం సుగమం అయింది.