jadcherla :జడ్చర్లలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్రలో భాగంగా అనిరుథ్ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా రైతురుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడంపై అనిరుథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంటనష్టం గురించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. నాలుగేళ్ల నుంచి మాటకూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.
కాగా నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడలో.. రైతు రుణ మాఫీ హామీపై కేసీఆర్ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ.. రాష్ట్రంలోనే మొదటిసారిగా చేపట్టిన కాంగ్రెస్ రైతు దరఖాస్తుల ఉద్యమానికి రైతన్నల నుంచి ఊహించని స్పందన వచ్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు కంటే వడ్డీ రెండు రెట్లు పెరిగిపోయిందని ఆవేదనతో రైతన్నలు దరఖాస్తులను అనిరుథ్ కు స్వయంగా అందజేసి గోడు వెల్లబోసుకున్నారు.
ఇదిలా ఉంటే ..పాదయాత్రలో భాగంగా అనిరుథ్ .. నేడు రాజాపూర్ మండలంలోని గుండ్లపోట్లపల్లి, ఆగ్రహరం పోట్లపల్లి, కల్లేపల్లి,నాయించెర్వు, బిబినగర్ ,ఇదిగానిపల్లి, మల్లేపల్లి పర్యటించనున్నారు. రైతుల నుంచి రుణమాఫీ దరఖాస్తులను స్వీకరించి.. ప్రజాసమస్యలను తెలుసుకోనున్నారు. పార్టీలకు అతీతంగా నేతలు, యువత, స్వచ్ఛందంగా తరలివచ్చి యాత్రకు మద్దతు తెలపాలని అనిరుథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని హితువు పలికారు. పేపర్ లీకేజ్, లిక్కర్ స్కాం, కాళేశ్వరం స్కాంలతో తెలంగాణ పరువు మంటగలిపిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేయాలని అనిరుథ్ అభ్యర్థించారు.