Vinod: తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని, పసుపు రైతుల చిరకాల ఆకాంక్షను కేంద్రం గౌరవించాలని.. గతేడాది అక్టోబర్ లో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ మాటను నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు. రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ ప్రధానమైనమైందని, గత 10 ఏళ్లుగా పసుపు మద్దతు ధర కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి, పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి చేసే అవకాశాలను కల్పించాలని రైతులు కోరుకుంటున్నారని.. రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 1,757 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 696 ఎకరాల్లో 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ జిల్లాలో కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, కొబ్బరితోటల అభివృద్ధి కోసం భద్రాద్రి కొత్తగూడెంలో రీజనల్ కొకనట్ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని తుమ్మల లేఖలో వెల్లడించారు. కొకనట్ బోర్డు ద్వారా రైతులకు అంతర పంటలు, మిశ్రమ పంటల విషయంలో చీడపీడల నివారణలో సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉండటంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తులు నాణ్యమైన కొబ్బరి మొలకలను నూతన వంగడాలను అందించడానికి అవకాశం ఏర్పడుడతుందని తుమ్మల అన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారని, ప్రతి ఏడాది 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రిగారు చెప్పారు. త్వరలోనే పామ్ ఆయిల్ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులతో చొరవ
తీసుకుని తెలంగాణలో ప్రాంతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు శాస్త్రీయ, సాంకేతిక సలహాలు, సూచనలను అందిస్తుందని మంత్రి లేఖలో వివరించారు.