దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వందల ఏళ్లు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుస ఓటముల్తో నిరాశలో ఉన్న కార్యకర్తలకు.. ఆపార్టీ అసంతృప్త నేతల జీ23 బృందం మరోసారి భేటీ జరగడం కలవర పెడుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో జరిగిన ఈ భేటీకి.. ఎంపీలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరు.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలపై త్వరలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు.. గ్రూప్-23 నేతలు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
పంజాబ్‌లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ నేత సిద్దూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన… జనం గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. జనం తీర్పును దేవుడి మాటతో పోల్చారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరముందంటూ సిద్దూ తనదైన శైలిలో స్పందించారు.
ఇక సిద్ధూ కామెంట్స్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధూ.. ఈ రకంగా తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా వరుస పరాజయాలతో ‘ఐసీయూ’లో చేరిన కాంగ్రెస్‌కు అత్యవసర చికిత్స చేయకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి మరింత కష్టతరమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.