×

Maharashtra elections2024:

మహారాష్ట్రలో అయిదేళ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’ కూటమిగా ఈ ఎన్నికల్లో ఆరు పార్టీలు రెండు శిబిరాలుగా ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగుతున్నాయి. పలు పార్టీలు, ఉపపార్టీల మధ్య పెరిగిన ఈ ఆధిపత్యపోరులో పీఠం దక్కేదెవరికి అన్నదొక సంక్లిష్టమైన ప్రశ్న..! దేశంలో భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, చారిత్రకంగా ఎంతో ప్రత్యేకత కలిగిన మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నపుడు ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయి.

మహారాష్ట్రలో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీ బలంగా ఉండడంతో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవు. అందుకే ప్రధాన పార్టీలు కూటములుగా తలపడుతున్నాయి. 1995 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం తగ్గడం ప్రారంభమైంది. 1999 నుంచి 2009 మధ్య జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ కలిసి వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ-శివసేన కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. మరోవైపు తన భాగస్వామి ఎన్సీపీ కూడా పలు సంప్రదాయ సామాజికవర్గాల్లో మద్దతు కోల్పోవడంతో ఈ కూటమి అధికారానికి దూరమైంది.
బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు సాధించాయి. అయితే ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా పొత్తు ధర్మం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పుతోందని ఆరోపిస్తూ శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. అదే క్రమంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్తో చేతులు కలపడంతో ఉద్ధవ్ థాక్రే సిద్ధాంతాలు ఆయన తండ్రి బాలాసాహెబ్ థాక్రే కంటే భిన్నమైనవని తేలింది. బాలాసాహేబ్ తండ్రి, సంఘ సంస్కర్త కేశవ్ సీతారాం థాక్రే మహారాష్ట్రలో కుల వివక్ష, బాల్య వివాహాలపై పోరాటాలు చేశారు. బాలాసాహేబ్ బీజేపీ బాటలో పయనించి ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటూ శివసేనపై హిందుత్వ ముద్ర వేశారు. ఆయన అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ తాత అడుగుజాడల్లో నడస్తూ శివసేన భారత జాతీయతను అంగీకరించని ముస్లింలను మాత్రమే వ్యతిరేకిస్తుందని చెబుతూ పార్టీకి లౌకికత్వ రంగులు పూశారు.

2017 బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే శివసేన తరఫున ముస్లిం అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. అందులో ఇద్దరు గెలిచారు కూడా! శివసేన 2019లో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన తర్వాత ఉద్ధవ్ థాక్రే సిద్ధాంతాల మీద మరింత స్పష్టత ఏర్పడింది. 2022 మేలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఒక సందర్భంలో మాట్లాడుతూ కులం, మతం, భాషలకు అతీతంగా వివక్ష లేకుండా అందరికీ న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. బీజేపీ హిందూత్వం కంటే, శివసేన హిందూత్వం భిన్నమైందని కూడా ఆయన చెప్పారు. ఈ ధోరణి పాత శివసేన కార్యకర్తలకు సైతం కొత్తగా అనిపించింది. అంతేకాక ఒకప్పుడు మహారాష్ట్రలో మత కలహాల సృష్టికర్త అని ఆరోపణలు ఎదుర్కొన్న శివసేన ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న రెండున్నరేళ్లు రాష్ట్రంలో ఎలాంటి మత కలహాలు జరగకపోవడం ఆ పార్టీలో వచ్చిన మార్పుకు సంకేతంగా నిలిచింది.

ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే ఇద్దరూ బాలా సాహేబ్ శివసేన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ 2022 జూన్లో ఆ పార్టీ నాయకుడు ఏక్ నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలతో శివసేనను చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. నెల రోజుల తర్వాత అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి బీజేపీ పంచన చేరడంతో మహా వికాస్ ఆఘాడి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుర్చీ దిగిపోయారు. ఆ సమయంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించినా, ఊహకందని విధంగా ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి కాగా, ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి అసెంబ్లీలో సీట్ల పరంగా 2/3 వంతు పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించలేదు. దీంతో అసలైన శివసేన తమదేనని పార్టీని షిందే హస్తగతం చేసుకున్నారు. ఇదే దారిలో పయనించిన అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి తమదే అసలు ఎన్సీపీ అని ప్రకటించుకున్నారు.

నాయకులు అధికారం కోసం పార్టీలను చీల్చడం ప్రజలకు మాత్రం నచ్చలేదని 2024 లోక్ సభ ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో చీలికలకు కారణమైన బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మీద తమ అసంతృప్తిని చూపించారు. ఉద్ధవ్ థాక్రే శివసేన తమ పార్టీ బలంగా ఉన్న 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లోని 17 సీట్లలో పోటీ చేసింది. ఉత్తర, పశ్చిమ మహారాష్ట్రలో బలంగా ఉన్న 10 స్థానాల్లో శరద్ పవార్ ఎన్సీపీ పోటీ చేసింది. మహా వికాస్ ఆఘాడి తమ బలాబలాలకు అనుగుణంగా పోటీ చేయడంతో వాటి మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగింది. మహాయుతి కూటమి ప్రాంతీయ బలాబలాలను పట్టించుకోకుండా సీట్లను పంచుకోవడం, ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రేపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించకుండా ఏక్ నాథ్ షిండే సాధించిన విజయాలను ప్రచారం చేయడంతో మహాయుతి మూల్యం చెల్లించుకుందని ఫలితాల్లో స్పష్టమైంది.

2024 లోక్ సభ ఎన్నికలను బట్టి అసెంబ్లీ స్థానాల్లో పరిశీలిస్తే రాష్ట్రంలోని 288 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 151 స్థానాల్లో, బీజేపీ కూటమి 128 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించాయి. ఇండియా కూటమికి 43.71 శాతం ఓట్లు రాగా, ఎన్డీయే కూటమికి 43.55 శాతం ఓట్లు వచ్చాయి. ఈ స్వల్పతేడానే, మొత్తం 48 లోక్ సభ స్థానాలకు గాను ఇండియా కూటమి 30 స్థానాలు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 17 సీట్లకు పరిమితమైంది. ఇండిపెండెంట్గా గెలిచిన ఒక కాంగ్రెస్ రెబల్ అనంతరం తిరిగి హస్తం గూటికి చేరారు. 2019తో పోలిస్తే ఈసారి ఎన్డీయే కూటమి 8 శాతం ఓట్లు కోల్పోగా, ఇండియా కూటమి 12 శాతం ఓట్లు పెంచుకుంది. 2019లో బీజేపీకి 28 శాతం ఓట్లు రాగా, 2024లో అది 26 శాతానికి తగ్గింది. సీట్లు పెంచుకున్న కాంగ్రెస్ కూడా గత ఎన్నికల్లో 16 శాతం ఓట్లు పొందగా, ఈసారి కేవలం ఒక్క శాతం పెంచుకుని 17 శాతానికే పరిమితమైంది. పార్టీ వచ్చిన చీలిక కారణంగా అధికారం కోల్పోయిన ఉద్ధవ్ పట్ల సానుభూతి, కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులపై ప్రజలు సానుకూలంగా ఉండటం ‘ఇండియా’ కూటమికి ఎన్నికల్లో మేలు చేసింది.
విదర్భా, పశ్చిమ మహారాష్ట్ర, మరట్వాడ ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ప్రాంతంలో మరాఠాలు బీజేపీకి దూరం జరిగారు. మహారాష్ట్ర రాజకీయాలు మరఠాల ఆధిపత్యానికి ప్రసిద్ధి. మహారాష్ట్రలో ఈసారి గెలిచిన ఎంపీల్లో సగం మంది మరాఠా కులం వాళ్లే!

మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంతో అన్ని పార్టీలూ మరాఠాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, ఈ రిజర్వేషన్లపై బీజేపీ ధోరణి ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. మరోవైపు ముంబై, కొంకణ్, థానే ప్రాంతాల్లో షిండే శివసేన ప్రభావం బలంగా ఉండటం వల్ల బీజేపీకి ఓటమి తప్పింది.
మహారాష్ట్ర ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే నిరుపేదలకు, కింది కులాలకు సరైన న్యాయం జరగలేదని ఆ వర్గాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో భంగపాటు తర్వాత మహాయుతి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. ఐదు నెలల కింద పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన రాష్ట్ర ఓటర్లు ఈ పథకాలపై ఎలా స్పందిస్తారో? ఈ అంశంతో పాటు కూటముల సీట్ల సర్దుబాటు కూడా ఆయా పార్టీల విజయావకాశాలను తేల్చనుంది. అంతే కాకుండా ఈ ఎన్నికల అనంతరం అసలైన శివసేన ఏవరిదో? అసలైన ఎన్సీపీ ఏదో? తేలడం ఖాయం!


-జి.మురళీ కృష్ణ,
రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole