జమ్మూ:
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు విదేశీ గూఢచార సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయా? విద్యావేత్తలు, పరిశోధకుల ముసుగులో పరిచయాలు పెంచుకుని వ్యూహాత్మక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయా? జమ్మూలో వెలుగుచూసిన తాజా ఘటన ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. చైనాతో సహా విదేశీ నిఘా సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు సున్నితమైన సమాచారం చేరవేశారనే ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఓ సీనియర్ ఆర్మీ అధికారి భార్య కావడం ఈ వ్యవహారాన్ని మరింత ప్రాధాన్యంగా మార్చింది.
అకడమిక్ పరిచయాల మాటున..
ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు తమను విద్యావేత్తలు, పరిశోధకులుగా పరిచయం చేసుకుంటూ మహిళతో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తొలుత పర్యావరణ సమస్యలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై వ్యాసాలు రాయాలని కోరినట్లు సమాచారం. అనంతరం క్రమంగా రక్షణ రంగం, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అంశాలపై రచనలు చేసేలా ప్రోత్సహించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ పరిచయాల వెనుక విదేశీ నిఘా సంస్థలకు చెందిన వ్యక్తులు ఉండవచ్చని, పరిశోధనల పేరుతో కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తుల అసలు గుర్తింపు, వారి నెట్వర్క్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
సమాచారం చేరవేతపై అనుమానాలు
దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు, ఫొటోలు, ఎలక్ట్రానిక్ సమాచారాన్ని రహస్యంగా సేకరించి విదేశీ వ్యక్తులకు చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సమాచార మార్పిడి జరిగిందా? ఒకవేళ జరిగితే, దాని పరిధి ఎంత? దేశ రక్షణకు సంబంధించిన ఏయే అంశాలు ఇందులో ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే, ఎలాంటి పత్రాలు నిజంగా బదిలీ అయ్యాయి, వాటిలో వర్గీకృత రక్షణ సమాచారం ఉందా, ఆరోపణలకు ఆధారాలేమిటి అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఈ వ్యవహారంలో జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 290/2026 నమోదు చేశారు. అధికార రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్లు 3, 5తో పాటు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 152, 61(2) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
విదేశీ వ్యక్తులతో మహిళకు పరిచయం ఎలా ఏర్పడింది? ఎప్పటి నుంచి సంబంధాలు కొనసాగుతున్నాయి? ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? ఆ సమాచారం ఎవరికి చేరింది? అనే అంశాలపై పోలీసులు, నిఘా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
విద్యావేత్తలుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు నిజంగానే విదేశీ నిఘా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారా? మహిళకు ఈ విషయంపై ముందస్తు అవగాహన ఉందా? లేక పరిశోధన, రచనల పేరుతో ఆమెను ఉపయోగించుకున్నారా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
