వినాయకుడు చెవిలో చెబితే కోరిక తీర్చేస్తాడుట!

౼ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడట

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఉన్నటువంటి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడని.. అన్ని చోట్ల కొలువై ఉన్న గణనాథుడు ఎల్లవేళలా భక్తులకు అండగా ఉంటాడని ప్రతీక. స్వామి కొలువై ఉన్న ఈ పుణ్యక్షే త్రాన్ని ఒక్కసారైనా దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

స్థల పురాణం :

క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది

ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది.

ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు.

ఎలా చేరుకోవాలి..?

బిక్కవోలుకు వెళ్లేందుకు రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి ఆటోలు, బస్సులు ప్రయాణికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి.