9.2 C
London
Wednesday, January 15, 2025
HomeAndhra PradeshPeoplespulse: పరువు కోసం పార్టీల పాట్లు..!

Peoplespulse: పరువు కోసం పార్టీల పాట్లు..!

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Telangana politics: 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎంత సవాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా అంతే పెద్ద సవాల్‌! ఒకరికి నిలవటం సవాలైతే మరొకరికి గెలవటం సవాల్‌. మంచి సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకువచ్చే వరకు రేవంత్‌రెడ్డికి అన్నీ సానుకూలమే! తాను సూచించే వ్యక్తులకు టిక్కెట్లు లభిస్తాయి. తాను కోరినపుడు-కోరినచోటికి ఢిల్లీ నాయకులస్తారు, రాసిచ్చింది ప్రకటిస్తారు. ఎలా తలచుకుంటే అవి అలా జరిగిపోతుంటాయి. ఇక జరగాల్సిందల్లా మెజారిటీ ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి ఆయన గెలుచుకు వచ్చి, ఢిల్లీ నాయకత్వం చేతిలో పెట్టడమే! అధిష్టానం పరంగా ఆలోచించినపుడు అది ఆయన కర్తవ్యం. బీఆర్‌ఎస్‌ ఎంత చతికిలపడ్డా…. బీజేపీని పక్కకు తోసేసి, కాంగ్రెస్‌ అధిష్టానం ఆశిస్తున్నట్టు 12 నుంచి 14 లోక్‌సభ స్థానాలు గెలవటం పీసీసీకి అంత తేలికయిన పనేం కాదు. ఈ ఎన్నికలిలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇరువురికీ అగ్నిపరీక్షే! లోక్‌సభ ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి కూడా ఒక సవాలే అయినా…. తెలంగాణలో ఇపుడు వారున్నంత సురక్షిత స్థితిలో మరో పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆశించి భంగపోయిన అసెంబ్లీ ఎన్నికలనాటితో పొలిస్తే, కారణాలేవైనా ఇప్పుడు బీజేపీ కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఇప్పుడున్న 4 స్థానాలు నిలబెట్టుకుంటూ మరో అరడజన్‌ స్థానాలైనా గెలిచి డబుల్‌ డిజిట్‌ పొందాలని నాయకత్వం యత్నిస్తోంది. బయట చూసేందుకు తెలంగాణ బరి ముక్కోణపు పోరులా కనబడుతున్నా… ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే! సీట్ల సంఖ్యలో ఆధిపత్యం నీదా? నాదా? అన్నదే తేలాల్సింది.

తను తీసిన గొయ్యిలో తానే….

రాజకీయంగా తెలంగాణలో ఇపుడు దయనీయ స్థితి భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)ది! సిట్టింగ్‌లు పార్టీ తరపున పోటీకి నిరాసక్తత చూపి, అడిగిన వారు బరిలో దిగడానికి ససేమిరా అని, పేరు ఖరారైన వారూ పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థి కావడం వరకు అన్ని అనర్థాలూ జరుగుతున్నాయి. నాయకులు పార్టీని వదిలి కాంగ్రెస్‌లోనో, బీజేపీ లోనో చేరిపోతున్నారు. వీలయితే వెళ్లి, కొందరు అక్కడ అభ్యర్థులౌతున్న పరిస్థితి! 2018 అసెంబ్లీ ఎన్నికల వెనువెంటనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ నాటి టీఆర్‌ఎస్‌ దెబ్బతిన్నా ఇంత దారుణం కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షంగా 88 (119 కి గాను) సీట్లు గెలిచి విజయబావుటా ఎగరేశారు. కానీ, నెలల వ్యవధిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, ‘‘కారు`సారు`పదహారు’’ అని ప్రచారాన్ని ఎంత ఊదరగొట్టినా…9 స్థానాలతో బోటాబోటి ఆధిక్యత దక్కింది. అనూహ్యంగా బీజేపీ ని 4, కాంగ్రెస్‌ ని 3, ఎంఐఎం ని 1 స్థానాల్లో గెలిపించి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరని ఓటర్లు వైవిధ్య తీర్పిచ్చారు. నాటి టీఆర్‌ఎస్‌కి, అసెంబ్లీ ఎన్నికల్లో 46.7 శాతం ఓట్లు రాగా లోక్‌సభ ఎన్నికల నాటికి అది 41.7 శాతానికి తగ్గిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణం. రేపటి ఎన్నికల్లో మెదక్‌ లో నెగ్గి జహిరాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర చోట్ల గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీ రామారావుకు, అసెంబ్లీకి తను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల భాగమైన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం గెలిపించుకోవడం సవాలే! రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అణచివేసే సంకల్పంతో, గత అయిదారేళ్లలో తరచూ ‘మాకు పోటీ బీజేపీయే’ అంటూ ఆ పార్టీని లేపిన పాపం బీఆర్‌ఎస్‌ దే! గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసి కూడా మారని పార్టీ సదరు వైఖరే వారికిపుడు గుణపాఠమైంది. కానీ, అదే బీజేపీతో పోటీ తట్టుకొని, కాంగ్రెస్‌ను నెట్టేసి కొన్ని సీట్లయినా గెలిచి, గౌరవం దక్కించుకోవాల్సిన పరిస్థితి! ఒక ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన అంతా అయిపోలేదని, తెలంగాణకు బీఆర్‌ఎస్‌ (రేపు మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారోచ్చు!) సంబద్దత ఇంకా ఉందని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలవటం అవసరం, అవకాశమే కాదు వారికిదొక పరీక్ష కూడా!

సేఫ్‌ పొజిషన్‌లో బీజేపీ!

ఏ లెక్కన చూసినా ఇపుడు బీజేపీదే సురక్షిత స్థానం. ఈసారి వారి స్థానాలు పెరుగుతాయి. ఓటింగ్‌ శాతం వృద్ది స్పష్టమైన సంకేతం. గత ఎన్నికల్లో నెగ్గిన సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌… నాలుగు స్థానాలు నిలబెట్టుకుంటూ అదనంగా ఎన్ని సీట్లు గెలిచినా వారికది లాభమే! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలపై పెద్ద ఆశలు పెట్టుకొని కూడా సరైన ఫలితాలు పొందలేకపోయారు. 8 అసెంబ్లీ సీట్లే దక్కినా పెద్ద సంఖ్య నియోజకవర్గాల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచి ఉనికి చాటుకున్నారు. అప్పుడు చేసిన కృషి ప్రస్తుత ఎన్నికలకు భూమిక అవుతోంది. దాదాపు రాష్ట్రమంతా పోటీ చేసి 2018 ఎన్నికల్లో 6.9 శాతం ఓట్లతో, ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచారు. 2019 నాటికి ఓటు షేర్‌ 19.7 శాతానికి పెరిగి, 4 లోక్‌సభ స్థానాలు దక్కాయి. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి రాష్ట్రమంతా పోటీ చేసి, 13.7 శాతం ఓటు షేర్‌తో 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది. గతంలో లాగే, ఓటు శాతం పెంచుకోవడాన్ని బట్టే ఇప్పుడు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రిగా కొనసాగుతూ పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్‌రెడ్డికి తన సికింద్రాబాద్‌ స్థానాన్ని నిలుపుకోవడం ఓ పెద్ద సవాల్‌! కరీంనగర్‌, నిజామాబాద్‌ కొంత సానుకూలంగానే ఉన్నా ఆదిలాబాద్‌లో గట్టిపోటీ ఉంది. కొత్తగా చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరిలలో పార్టీకి మంచి విజయావకాశాలున్నట్టు నాయకత్వం నమ్ముతోంది. వీటికి తోడు, ముక్కోణపు పోటీ అనుకుంటున్న జహీరాబాద్‌, పెద్దపల్లి, భువనగిరి లలోనూ మోదీ హవా పనిచేస్తే, గెలిపు తమదేనని బీజేపీ సానుభూతిపరుల ఆశ! ఏ ఇతర అంశాలకన్నా మోదీ మంత్రమే వారికిపుడు పెద్ద దిక్కు! పాటిల్‌ (జహీరాబాద్‌), శ్రీనివాస్‌ (పెద్దపల్లి), భరత్‌ (నాగర్‌కర్నూల్‌), నగేష్‌ (ఆదిలాబాద్‌), రమేష్‌ (వరంగల్‌), సైదిరెడ్డి (నల్గండ) వంటి అరువు అభ్యర్థులనే బరిలోకి దింపినా…. రాష్ట్ర నాయకత్వం గెలుపు ధీమాకు కారణం అదే! పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య అనారోగ్య స్పర్ధ ఉందని, దాన్ని చక్కదిద్దుకొని సమన్వయం సాధించాలని కేంద్ర నాయకత్వం హెచ్చరిస్తోంది.

కాంగ్రెస్‌కు ఫలితం, కష్టపడితేనే!

మొన్నటి అసెంబ్లీ ఫలితాలను చూసి, అదే బాటలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు ఆటోమెటిక్‌గా తమ ఖాతాలో పడిపోతాయని కాంగ్రెస్‌ నిమ్మళంగా ఉండే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ గట్టిగా పోరాడితేనే ఆ లక్ష్యంవైపు అడుగులు పడతాయి. లేకుంటే, నాలుగయిదు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీ గెలుపు గాలివాటు కాదని, పార్టీపై ప్రజలు చూపిన నమ్మకం, విశ్వాసం అని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవాల్సిందే! పైగా, ‘నాలుగు మాసాల మా ప్రభుత్వం పనితీరుకు రేపటి ఎన్నికల ఫలితాలు రెఫరెండమ్‌’ అని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలూ ప్రకటిస్తున్నారు. అందుకే, రేవంత్‌రెడ్డిపైన పెద్ద బాధ్యత ఉంది. తన అసెంబ్లీ స్థానం కొడంగల్‌ కలిసి ఉన్న మహబూబ్‌నగర్‌, ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి…. రెండు లోక్‌సభ సీట్లలో పార్టీని గెలిపించుకోవడం ఇప్పుడాయన ముందున్న సవాల్‌! దానికన్నా పెద్ద సవాల్‌, తెలంగాణలో బీజేపీకి మించిన సంఖ్యలో స్థానాలు కాంగ్రెస్‌కు తీసుకురావాలి. తగ్గితే, రేవంత్‌ పట్ల అటు పార్టీ నాయకత్వ వైఖరిలో, ఇటు రాష్ట్ర నాయకులు, కార్యకర్తల చూపులోనూ తేడా వచ్చే ఆస్కారం బలంగా ఉంటుంది. అప్పుడిక అన్నీ కష్టాలే! అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్నంత సమన్వయం పార్టీ శ్రేణుల్లో ఇప్పుడుందా? ఇదొక చిక్కు ప్రశ్న! ఆ ఊపు మాత్రం లేదిపుడు. ఎస్సీ రిజర్వు స్థానాల అభ్యర్థుల ఖరారులో కులాలు`ఉపకులాల పంచాయితీ ఉంది. అన్నీ మాలలకే ఇస్తున్నారనే విమర్శ ఉంది. ఒక వైపు మాదిగలను మచ్ఛిక చేసుకునే ప్రయాసలో బీజేపీ ఉంటే, మరో పక్క కాంగ్రెస్‌లో ఈ వివాదం వారికి నష్టమే! బీజేపీ లాగే కాంగ్రెస్‌ కూడా ఈ సారి తెలంగాణ పలుచోట్ల అరువు అభ్యర్థులపై ఆధారపడుతోంది. కావ్య (వరంగల్‌), దానం నాగేందర్‌ (సికింద్రాబాద్‌), పట్నం సునీత (మల్కాజిగిరి), నీలం మధు (మెదక్‌), రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) తదితరులంతా ఆఖరు రోజుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి అభ్యర్థులైన వారే! అభ్యర్థుల ఖరారులో అక్కడక్కడ జరిగిన తప్పిదాలు పార్టీ అవకాశాలను దెబ్బతీశాయనే భావన కాంగ్రెస్‌ వర్గాల్లో ఉంది. ముందనుకున్నట్టే సునీతను చేవెళ్ల అభ్యర్థిని చేసి ఉండాల్సింది. తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్‌లోకి వచ్చిన రంజీత్‌ రెడ్డికి, కావాలంటే అదే మల్కాజిగిరి స్థానం ఇచ్చివుంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవనే అభిప్రాయం సగటు కార్యకర్త వ్యక్తం చేస్తున్నారు.

ఈ పోరాటంలో పై చేయి కాంగ్రెస్‌దయినా, బీజేపీదయినా… అందులో పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు. సంస్థాగత నిర్మాణం కాకుండా, వ్యక్తి కేంద్రకంగా అధినేత చుట్టూ అల్లుకొని ఎదిగే ప్రాంతీయపార్టీలున్న ఈ రోజుల్లో… కొద్దో గొప్పో సీట్లు తెచ్చుకొని పరువు నిలుపుకోకుంటే బీఆర్‌ఎస్‌ ఉనికి ప్రమాదంలో పడటం ఖాయం. 

==============

ఆర్ . దిలీప్‌రెడ్డి,పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole