Telangana:
newsminute24/ Uday ✍🏽
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు.. అవసరాలను బట్టి రాజకీయాలు మారుతుంటాయి! ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే తరహా పరిణామం కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ ద్రోహిగా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు అదే చంద్రబాబును దార్శనికుడిగా ప్రశంసిస్తున్నారు. తాజాగా కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఈ మార్పు వెనుక కారణమేంటి? రాజకీయ వ్యూహమా? లేక చంద్రబాబు పాలనా విధానాలపై అభిప్రాయ మార్పా?
తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు వంటి అంశాల్లో చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించారని ఆరోపించింది.
అటు బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు చంద్రబాబు విధానాలను తప్పుబట్టారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రాజీపడే ప్రసక్తే లేదంటూ బీఆర్ఎస్ నేతలు గట్టిగా తమ వాదన వినిపించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు మాదిరి ఒకప్పుడు విమర్శించిన చంద్రబాబు పాలనా దక్షతను, ముందుచూపును కేటీఆర్, హరీశ్‌రావు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతానికి నీటిని తీసుకెళ్లేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఆయన పట్టుదలను కొనియాడుతున్నారు.
ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూ చంద్రబాబు పాలనా శైలితో పోల్చుతున్నారు.
ఇక ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ వైఖరిలో మార్పు వచ్చిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు గణనీయంగా ఉండటంతో.. చంద్రబాబుకు ఉన్న అభిమానాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే వ్యూహంతో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారా? అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
అయితే ఇది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం మాత్రమే. బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ, పాలనా అంశాలనే ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ప్రశంసలు కురిపించడం రాజకీయ అవకాశవాదమని ఆరోపిస్తున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను కూడా తెరపైకి తీసుకొస్తున్నాయి.
మొత్తానికి.. నాడు తెలంగాణ ప్రయోజనాలకు అడ్డంకిగా అభివర్ణించిన చంద్రబాబునే.. నేడు దార్శనికుడిగా ప్రశంసించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామం. ఇది కేవలం అభిప్రాయ మార్పా? లేక ఎన్నికల రాజకీయాల్లో కొత్త వ్యూహమా? అన్నది వేచి చూడాలి.
ఎందుకంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు.. శాశ్వతంగా ఉండేది రాజకీయ ప్రయోజనాలేనా?
