×

Maharashtra elections 2024:

లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ అగ్రనేతలకు అంటించిన చురకలు వారిని ఆకాశం నుండి నేలకు దింపాయి. దీంతో హిందీ బెల్ట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని గుర్తించి, ఆర్ఎస్ఎస్ సహాయసహకారాలు తీసుకొని గట్టెక్కిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలోనే ఎన్నికలకు సిద్ధమవుతోంది.

ఇటీవల జరిగిన హర్యానా, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ క్రియాశీలకపాత్ర పోషించడంతో మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇప్పుడు సంఘ్ పరివార్ పతాక శీర్షికలో నిలిచింది. హర్యానాలో పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరిగినా ఆ పార్టీ గెలుపు వెనుక ఆర్ఎస్ఎస్ ఉందనేది కాదనలేని సత్యం. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రచారక్లతో సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వమని సూచించడంతో బీజేపీ దాదాపు సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపకుండా వారిపై ఉన్న వ్యతిరేకత నుండి గట్టెక్కింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రత్యేకించి జమ్మూ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రభావం చూపించింది. సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందు ఆర్ఎస్ఎస్ నుండి తీసుకొచ్చి రాంమాధవ్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంతో బీజేపీ గతం కంటే అధిక స్థానాలు సాధించింది. జమ్మూ ప్రాంతంలో సంఘ్ సూచనలమేరకు బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేయడంతో ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 29 స్థానాలు జమ్మూ నుండి వచ్చినవే. ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ లేకుండా ఆశించిన విజయాలు సాధించలేమని గుర్తించిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర ‘మహా’ సంగ్రామంలో కూడా సంఘ్కు పెద్దపీట వేస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ బృందం దృష్టికొచ్చింది.

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహ వికాస్ అగాఢీ’ కూటముల మధ్య పోటాపోటీగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఘ్ పరివార్ కీలక పాత్ర పోషించనుంది. ఆర్థిక రాజధాని ముంబాయి కేంద్రకమైన మహారాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించిన ఆర్ఎస్ఎస్ అన్నింటిలో తానై బీజేపీకి వెనుదన్నుగా నిలుస్తోంది. మాయూతి కూటమిలో బీజేపీ తీసుకోవాల్సిన టికెట్లు, భాగస్వాములైన శివసేన (ఏకనాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలకు ఇవ్వాల్సిన సీట్లపై కూడా ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే బీజేపీ అడుగులేస్తుంది. ఆర్ఎస్ఎస్ హెడ్క్వార్టర్స్ నాగపూర్లోనే ఉండడంతో కూడా సంఘ్ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొంది. మరోవైపు నాగపూర్ కేంద్రకమైన విదర్భ రీజియన్లో అధికంగా 67 స్థానాలుండడంతో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండడంతో సంఘ్ పరివార్ ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరాఠ్వాఢా, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన ఆర్ఎస్ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా సంఘ్ కార్యకర్తలను మోహరించింది. ముస్లింలు, మరాఠ, దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో వారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో వ్యూహరచనలో భాగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి కీలక సూచనలు చేస్తూ అందుకు అనుగుణంగా పార్టీని నడిపిస్తోంది.

మాయూతి కూటమిలో అజిత్ పవార్ వర్గంపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉండడంతో గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతోనే బీజేపీ నష్ట పోయిందని సంఘ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానించాయి. ఒకనొక దశలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ (అజిత్ పవార్)తో పొత్తు పెట్టుకోవద్దని సంఘ్ బీజేపీకి సూచించినా ఎన్నికల వేళ తప్పుడు సమాచారం వెళ్తుందనే భావనతో వెనకడుగు వేసింది. అయితే అవినీతి ఆరోపణలు ఉన్న అజిత్ పవార్ వర్గాన్ని వీలైనంతగా తక్కువ స్థానాలకే పరిమితం చేయాలని ఆర్ఎస్ఎస్ సూచనలతో మాయూతి కూటమి టికెట్ల కేటాయింపులో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన శివనసేనలో ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులకు అధిక ప్రాధాన్యత ఉండేలా సంఘ్ పరివార్ వ్యవహరిస్తోంది. బీజేపీలోనే కాకుండా మాయూతి కూటమిలోని ఎన్సీపీ, శివసేన అభ్యర్థుల ఎంపికలోనూ ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పుతుండడంతో మూడు పార్టీలోని టికెట్ ఆశావహులు సంఘ్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో టికెట్ల కేటాయింపులో ఆర్ఎస్ఎస్ జోక్యంతో కూటమిలో అసంతృప్తి మొదలుకావడంతో ఈ పరిణామాలు నష్టం చేకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
టికెట్ల కేటాయింపులోనే కాకుండా బీజేపీకి అనుకూల ప్రచార శైలీలో ఆర్ఎస్ఎస్ పోషిస్తున్న పాత్ర చాపకింద నీరులా సాగుతోంది.

లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ బాధ్యతలు చూసిన డిప్యూటీ సీం ఫడ్నవీస్ స్థానంలో ఇప్పుడు కేంద్ర మంత్రి, సీనియర్ నేత నితిన్ గడ్కరీకి ప్రాధాన్యత ఇచ్చేలా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సూచనలు చేసింది. దీంతో పార్టీ గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో గడ్కరీ సూచనలను పార్టీ గౌరవిస్తోంది. గడ్కరీయే కాకుండా రావ్సాహెబ్ దాన్వే, పంకజ్ ముండే, సుధీర్ ముంగన్ తివార్తో పాటు మరో 21 మంది సీనియర్ నేతలకు బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. బీజేపీ భారీ ర్యాలీలు, సభలు, భాజా భజంత్రీలతో హడావుడి చేస్తుంటే ఆర్ఎస్ఎస్ శాఖల్లోని సంచాలక్లు, ప్రముఖ్లు, ప్రచారక్లు, కార్యకర్తలు బూత్స్థాయిల్లో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ కోసం ప్రచారం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ తమ ప్రతి శాఖ పరిధిలో 500 మందికిపైగా ఓటర్లను కలుసుకొని వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చిస్తుంది. సెగ్మంట్లో మెరుగైన అభ్యర్థి ఎంపికతో పాటు స్థానిక సమస్యలపై కూడా దృష్టి పెట్టి వాటికనుగుణంగా ప్రచార శైలీని కూడా ఆర్ఎస్ఎస్ మూడో కంటికి తెలియకుండా నిర్వహిస్తుంది.

మరాఠ, దళితులు, ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఆయా సామాజిక వర్గాల ప్రభావిత నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. హర్యానాలో జాట్లేతరుల ఓట్లతో లబ్ది పొందినట్టు మహారాష్ట్రలో మరాఠాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మరాఠేతరులపై దృష్టి పెట్టిన ఆర్ఎస్ఎస్ అందుకు అనుగుణంగా టికెట్ల కేటాయింపులో, ప్రచారంలో బీజేపీకి సూచనలు ఇస్తుంది. రాష్ట్రంలో 17 శాతంపైగా ఉన్న దళితుల్లో సగంపైన ఉండే బౌద్ధ సామాజికవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వనవాసి కల్యాణ్ ఆశ్రం కార్యక్రమాలతో ఇప్పటికే ఆ వర్గాలకు చేరువైన ఆర్ఎస్ఎస్ ఇటీవల బౌద్ధ సన్యాసులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఈ సామాజికవర్గానికి చేరువయ్యేందుకు బీజేపీ ఇప్పటికే 400 పైగా చిన్నచిన్న సమావేశాలను నిర్వహించడం వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది. 12 శాతానికిపైగా ముస్లిం ఓట్లతో బీజేపీకి ఇబ్బందులు తప్పవని గుర్తించిన ఆర్ఎస్ఎస్ ఇటీవల బీజేపీ అధిష్టానంతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించింది. గత లోక్సభ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ఓటు వేయడంతో 14 స్థానాల్లో పార్టీ ఓడిపోయిందని గుర్తించిన ఆర్ఎస్ఎస్ గణాంకాలతో కూడిన ‘ఓట్ జిహాద్’ పేరుతో ఒక నివేదిక తయారు చేసి, ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పార్టీకి సూచించింది. ‘ఓట్ జిహాద్’ను ఎన్నికల ప్రచార అంశంగా చేసుకొని సంబంధిత సెగ్మంట్లలో దీనికి వ్యతిరేకంగా హిందూ ఓట్లను గంపగుత్తగా పొందాలని ప్రణాళికలు రూపొందిస్తూ సంఫ్ు పరివార్ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తోంది.
2024 లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉన్న ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర ‘మహా సంగ్రామంలో’ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులతో, ప్రత్యేక వ్యూహాలతో పోటాపోటీగా బరిలో ఉన్నా ఈ రెండు పార్టీలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఆర్ఎస్ఎస్. కాంగ్రెస్ తానంత తానే ప్రచారం నిర్వహిస్తుంటే బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్తో దాని అనుబంధ సంస్థలు ఇంటింటికీ ప్రచారం చేస్తూ ప్రతి ఓటర్ను కలుస్తుండడం ఆ పార్టీకి బలమైన అస్త్రం. ఈ పరిణామాల మధ్య రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనకపోయినా ‘మహా సంగ్రామంలో’ పరోక్షంగా సంఘ్ నిర్వహించే పాత్ర కీలకం కానుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all
Optimized by Optimole