Nancharaiah merugumala senior journalist: (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!)
…………………………………………………………………………..
‘ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014 మధ్య, ఆ తర్వాత కూడా బుర్రలు, బొర్రలు బలిసిన ఆంధ్రోళ్లు సైతం ఈ తీరున దాదాపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో మాట్లాడి ఉండరు. రేవంత్ స్థాయిలో బూతులు తిట్టి ఉండరు. తెలంగాణను ఇచ్చింది సోనియమ్మా గాంధీ, తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనడం దాదాపు పదేళ్ల నుంచి కొందరికి అలవాటుగా మారింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం న్యూఢిల్లీ నుంచి ‘తీసుకొచ్చింది, మోసుకొచ్చిందీ’ ఎంత నిజమో–సోనియా గాంధీ తెలంగాణ ‘ఇవ్వడం’ కూడా అంతే వాస్తవం. రెండొందల ఏళ్ల బ్రిటిష్ వారి పాలనలో ఈ రకంగా మాట్లాడడం మనం మన పూర్వీకుల నుంచి నేర్చుకున్నాం. సోనియా గాంధీ దాదాపు ఐదు కోట్ల ఆంధ్రోళ్లను నాటి కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మోసపూరిత, భఢవా పగటి వేషగాళ్ల ఆసరాతో పెద్ద దద్దమ్మలను, వెర్రివాళ్లను చేసిందంటే– అందులో చాలా వరకు నిజం ఉంటుంది. 2013 జులై–2014 ఫిబ్రవరి మాసాల మధ్య మూడు ప్రాంతాల తెలుగు ప్రజలకు సోనియా–ఏమిచ్చారో, బుర్ర తక్కువ తెలుగు జనం ఏం పుచ్చుకున్నారో భవిష్యత్తులో చరిత్రకారులు రాస్తారు. రాష్ట్ర విభజన తర్వాత కాస్త తెలివి తెచ్చుకున్న తెలుగోళ్లు (రెండు రాష్ట్రాల్లో నివసించే జనం) వరుసగా 2014, 2018, 2019 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, ఆమె సంతానం ప్రియాంక, రాహుల్ గాంధీలను బర్రె తోలు చెప్పులకు ఏమి రాసి కొట్టారో ఇంకా మనం మర్చిపోలేదు. తెలంగాణ వచ్చిన కొత్తలో–ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వస్ స్టీవెన్సన్ గారిని ఈ రేవంతు లక్షల రూపాయలు చూపించి బురిడీ కొట్టించలేకపోయిన విషయం తెలంగాణ జనం ఇంకా మరిచిపోలేదు. పాలమ్మి, పూలమ్మి, ఆ తర్వాత క్లాసుగా కోడలు, అల్లుడి సహకారంతో సదువులమ్మి వందల వేల కోట్లు సంపాదించడం మాత్రమే తెలిసిన తోటి తెలంగాణ రెడ్డి చామకూర మల్లారెడ్డిని »ñ దిరించి, అవసరమైనవి గుంజుకోవడం సూదిని జైపాల్ రెడ్డి గారి తమ్ముడి అల్లుడైన అనుముల రేవంత్ రెడ్డికి సులువైన పని కావచ్చు. అంతేగాని గ్లోబల్ సిటీ హైదరాబాదు నగరంతోపాటే అన్ని విధాలా ఎదిగిపోతున్న కోట్లాది తెలంగాణ ప్రజలను సోనియా–రాహుల్–ప్రియాంక పేర్లతో దాదాపు పదేళ్ల తర్వాత మోసం చేయడం అసాధ్యమని ఎంత త్వరగా గుర్తిస్తే రేవంతుకు అంత మంచిది. ఇక నుంచైనా ‘భారతదేశానికి సొతంత్రం బ్రిటీషోళ్లు ఇచ్చారు. మహాత్మా గాంధీ లండన్ పోయి దాన్ని తీసుకొచ్చాడు’ వంటి మాటలను తెలంగాణ స్థాయికి తీసుకొచ్చి కాంగ్రెసోళ్లు మాట్లాడడం మానుకుంటే హస్తం పార్టీకి క్షేమకరం.