తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala:

______________________

తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా?

…………………………………………………………………………

ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తూర్పు కాపులను, తెలంగాణలోని మున్నూరు కాపులను కలుపుకుపోతూ రెడ్లు, కమ్మలకు రాజకీయ ప్రత్యామ్నాయ సామాజిక శక్తిగా మారడానికి కాపులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కాస్త ఎక్కువ సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు, ఉత్తరాంధ్రలో కేంద్రీకృతమై ఉన్న తూర్పు కాపులు ఓసీ కాపులంత సంపన్నులు కాదు.

కాని, ఈమధ్య రాజకీయ చైతన్యంతో, ఆర్థిక, సామాజిక ప్రగతితో ఓసీ కాపు, బలిజ, తెలగ సంకీర్ణంతో పోటీపడే స్థితికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులకు పవన్‌ కల్యాణ్‌ బాబు రాజకీయ ప్రగతికి దారి చూపే ప్రయత్నం చేయడం వింతగా ఉంది. బీసీ–డీ గ్రూపులో ఉన్నా గణనీయ అభివృద్ధి సాధిస్తున్న మున్నూరు, తూర్పు కాపులకు ‘పెద్దన్నలా’ కాపులు వ్యవహరించడం వల్ల ఏ కులానికీ ప్రయోజనం ఉండదు. రాజకీయ బేరసారాల కోసం ఈ రెండు బీసీ వర్గాలను తమలో కలుపుకునే ప్రయత్నం కాపులు గతంలో చేసి సాధించింది కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో తూర్పు కాపులు 46 లక్షల మంది ఉన్నారనే ఉత్తుత్తి గణాంకాలు కల్యాణ్‌ బాబు గారు చెప్పడం వల్ల తమకేమీ లాభం ఉండదని తూర్పు కాపులకూ తెలుసు.

ఇంత జనసంఖ్య ఉండి కూడా తూర్పు కాపులు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలను ప్రాధేయపడుతున్నారని పవన్‌ కల్యాణ్‌ వాపోవడం చూస్తే బాధేస్తుంది. తన వంటి రాజకీయ నాయకులకు కులం గురించి మాట్లాడడం ఇబ్బందికరమంటూనే–‘తూర్పు కాపు దిగ్గజం’, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను చూస్తే జాలేస్తుందనీ, తన కులానికి సత్తిబాబు గారు ఏమీ చేయలేకపోతున్నారని, తన పార్టీ అధినేతకు తన కులపోళ్ల కష్టాలు వివరించలేకలేకపోతున్నారని జనసేనాని చెప్పడం ఆయన (కేపీకే) నాయకత్వంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

కాపు సముదాయాలను రాజకీయ–సామాజిక పునాదిగా చేసుకుని తమ రాజకీయ భవిష్యత్తు నిర్మించాలనుకున్న అన్నయ్య కొణిదల చిరంజీవి గారికి గాని, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ గారికి గాని కాపుల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అసలు సమగ్ర అవగాహన ఉందా? అని ఎవరైనా రెడ్లు, కమ్మలు ప్రశ్నిస్తే జవాబు చెప్పడం కష్టమే. ఒకరకంగా ఆధునిక అభివృద్ధిలో ఈ రెండు అగ్రకులాల మార్గంలో పయనిస్తున్న కాపులు చట్టసభల్లో గణనీయ రీతిలో ప్రాతినిధ్యం సంపాదించారు. మంత్రి పదవులు కూడా వారి జనాభాతో పోల్చితే కాస్త ఎక్కువే. తెలుగు సినిమా రంగంలో ఈ కులస్తులదే ‘ఒక మోస్తరు’ ఆధిపత్యం. అయినా ఈ సామాజికవర్గానికి రెడ్లు, కమ్మల స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో పట్టు లేదనే బాధ నిరంతరం పీడిస్తూనే ఉంది. 

‘కాపుల కళ్లల్లో కారాలు, మిరియాలూ’!

………………………………………….

మున్నూరు కాపు కుటుంబంలో పుట్టిన గొప్ప బీసీ నాయకుడు, న్యాయకోవిదుడు, కేంద్రమంత్రి పుంజాల శివశంకర్‌ గారి తోడ్పాటు లేదా జోక్యం వల్లనే (1980ల చివర్లో చేసిన కృషితో) కోస్తా ఓసీ కాపుల్లో ఈ మాత్రం రాజకీయ చైతన్యం వచ్చిందని కొందరు అభిప్రాడుతున్నారు. శివశంకర్‌ గారి సాయమే లేకుంటే కాపులు ఏమయిపోయేవారని మరి కొందరు అడుగుతున్నారు. సామాజికంగా మెరుగైన హోదా, ఆర్థిక సంపత్తి, మంచి చదువులతో రెడ్లు, కమ్మల స్థాయికి ఎదుగుతున్న కాపులకు ఒక్కటే లోటు. అదేమంటే–ఈ రెండు కులాల మాదిరిగా రాజకీయ ఆధిపత్యం లేకపోడం. ఆధునిక భారత రాజకీయాల్లో ‘గేట్‌ క్రాషింగ్‌’ ద్వారా రాజకీయంగా పైకి రావడం అన్ని కులాలకు కుదిరే పనికాదని అనేక రాష్ట్రాల్లో రుజువైంది. కాపుల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుందేమో మరి.

ఈ పరిణామలు చూస్తుంటే 30–40 ఏళ్ల నాటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. 1980ల్లో విజయవాడలో ఇద్దరు కాపు, కమ్మ ‘బాహుబలి’ ఎమ్యెల్యేల నాయకత్వాన రెండు సామాజికవర్గాల రాజకీయాలు, సంబంధిత దందాలు నడుస్తుండేవి. ఇలాంటి కార్యకలాపాలపై ఆసక్తి ఉన్న మిగిలిన కులాలోళ్లు ఈ రెండు గ్రూపుల్లో చేరి పనిచేసేవారు. బాగుపడేవారు. అప్పట్లో కాపునాడు పేరుతో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా మిరియాల వెంకటరావు గారు ఉండేవారు. అప్పటి బెజవాడలోని కాపు వ్యతిరేక సామాజికవర్గం నేత ప్రోద్బలంతో అక్కడి ఏలూరు రోడ్డు గోడలపై–‘ఒరే మిరియాలూ, కాపుల కళ్లల్లో కొట్టకురా కారాలు!–ఇట్లు కాపు యువత’ అని రాసిన నినాదాలు చదివిన విషయం ఇంకా ఆ తరం వారికి గుర్తుంది.