ఆందోళన నుంచి తక్షణం తప్పుకుంటున్నాం : వీఎం సింగ్

వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల పోరాటంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పు కుంటునట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించారు. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే రోజున ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.
ఎర్రకోట మీద జెండా ఎగరేసి మనం సాధించారని.. ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాలకు గుర్తుగా జరుపుకునే పర్వదినాన్ని అపవిత్రం చేశారన్నారు. ర్యాలీ ప్రవేశ సమయం కంటే ముందుగానే ఎందుకు బయలుదేరారని, అనుమతించిన మార్గాన్ని ఎందుకు ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము ఈ ఆందోళననుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనిపై రాకేష్ తికాయత్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు. రైతుల హక్కులు, కనీస మద్దతు ధర, గిట్టు బాటు ధర కోసం తమ ఉద్యమం కొనసాగుతుంది. అనైతిక పద్దతిలో కాదని స్పష్టం చేశారు. జరిగిన హింసకు తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.