Entertainment:
సినిమా ప్రపంచం అంటే గ్లామర్, కృత్రిమ మెరుపులు, మేకప్‌ల హంగామా గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆర్భాటాల మధ్య సహజత్వాన్నే తన అసలైన అందంగా మార్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి . తెరపై ఆమె కనిపిస్తే చాలు… పక్కింటి అమ్మాయి మన ముందుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఆమె నవ్వులో అమాయకత్వం….. నటనలో నిజాయితీ కనిపిస్తాయి. పాత్రలో జీవిస్తూ, భావాలను కళ్లతో పలికిస్తూ సహజ నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాయి పల్లవి హీరోయిన్‌గానే కాకుండా సహజత్వానికి ప్రతీకగా నిలిచింది..
1992 మే 9న తమిళనాడులోని కోటగిరిలో పుట్టిన సాయి పల్లవి చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకుంది. ముఖ్యంగా డ్యాన్స్‌పై ఉన్న అభిరుచి ఆమెను రియాలిటీ షోల వరకు తీసుకెళ్లింది. “ఉంగలిల్ యార్ అదుతా ప్రభుదేవా” వంటి కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. అయితే ఆమె లక్ష్యం కేవలం సినీరంగం కాదు. వైద్య విద్యను పూర్తిచేసి డాక్టర్ అవ్వాలన్న సంకల్పంతో చదువును కొనసాగించింది. జార్జియాలో వైద్య విద్య పూర్తిచేసినా, కళపై ఉన్న ప్రేమ ఆమెను మళ్లీ కెమెరా ముందుకు తీసుకొచ్చింది.
2015లో వచ్చిన మలయాళ చిత్రం “ప్రేమమ్” ఆమె సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్. మాళర్ టీచర్‌గా ఆమె చూపిన సహజ నటన దక్షిణాది సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. మేకప్ లేకుండా సహజ నటనతో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. “ప్రేమం” తర్వాత సాయి పల్లవి కేవలం హీరోయిన్ కాదు సంచలనాలకు కేంద్రంగా మారింది. తెలుగులో ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చింది “ఫిదా”. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రంలో భానుమతిగా సాయి పల్లవి నటన అసాధారణం. తెలంగాణ యాసలో ఆమె పలికిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. “ఓయ్ పిల్లగాడా…” అంటూ అల్లరి చేసే మరదలిపిల్లగా ఆమె చూపిన చలాకీతనం యువత హృదయాలను కొల్లగొట్టింది. ఆ పాత్రలో ఆమె జీవించింది అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ గ్రామీణ యువతిలో ఉండే అల్లరి, ఆత్మగౌరవం, ప్రేమ, కోపం అన్నింటినీ ఆమె సహజంగా, గొప్పగా ఆవిష్కరించింది.
సాయి పల్లవి నటనలో కనిపించే ప్రత్యేకత ఏమిటంటే… ఆమె పాత్ర కోసం తనను పూర్తిగా మార్చుకుంటుంది. కెమెరా ముందు ఉన్నాననే భావన ఆమె ముఖంలో కనిపించదు. కళ్లతో భావాలు పలికించడం, మాటల కంటే హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమెకు మాత్రమే సాధ్యమైన కళ. అందుకే సాయిపల్లవి నటించిన పాత్రలు కేవలం సినిమా ముగిసే వరకు మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోతాయి. సాధారణంగా సినీరంగంలో స్టార్డమ్ కోసం గ్లామర్ ప్రదర్శన, కమర్షియల్ హంగామా అవసరమని భావిస్తారు. కానీ సాయి పల్లవి ఆ భావనను పూర్తిగా మార్చేసింది. మేకప్ లేకుండానే తెరపై కనిపించి కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. సహజంగానే తెరపై కనిపించడం ద్వారా “అందం అంటే కృత్రిమ మెరుపు కాదు… ఆత్మవిశ్వాసం” అని యువతకు ఒక గొప్ప సందేశం ఇచ్చింది.
నేటి సోషల్ మీడియా ప్రభావిత కాలంలో యువత ఎక్కువగా బాహ్య అందంపై మోజు పెంచుకుంటున్న వేళ, సాయి పల్లవి వ్యక్తిత్వం ఒక ప్రేరణగా నిలుస్తోంది. సహజత్వాన్ని ప్రేమించడం, మనల్ని మనం అంగీకరించుకోవడం ఎంత ముఖ్యమో ఆమె జీవితం చెప్తుంది. అందుకే ఆమెను అభిమానులు కేవలం హీరోయిన్గా కాకుండా ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా చూస్తున్నారు. సినిమాల ఎంపికలో కూడా సాయి పల్లవి తన ప్రత్యేకతను కాపాడుకుంటోంది. ప్రతి సినిమా చేయాలనే ఆత్రం ఆమెకు లేదు. కథలో బలం ఉండాలి… పాత్రలో అర్థం ఉండాలి… తన పాత్రకు గౌరవం ఉండాలనే ప్రధాన ప్రమాణాలతోనే ఆమె సినిమాలు ఎంచుకుంటోంది. ఆమె నటించిన చిత్రాలు తక్కువైనా ప్రభావం మాత్రం అధికంగా ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో చూస్తే “లవ్ స్టోరీ”, “శ్యామ్ సింగరాయ్”, “గార్గి”, “విరాట పర్వం” వంటి చిత్రాల్లో ఆమె చూపిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
“గార్గి” సినిమాలో ఒక సాధారణ యువతి ఎదుర్కొనే సామాజిక, న్యాయ పోరాటాన్ని ఆమె అద్భుతంగా ఆవిష్కరించింది. “విరాట పర్వం”లో విప్లవ భావజాలంతో ప్రేమను మిళితం చేసిన పాత్రలో ఆమె నటన మరింత పరిపక్వతను చాటింది. కమర్షియల్ సినిమా, క్లాస్ సినిమా అనే తేడా లేకుండా ప్రతి పాత్రలోనూ తన ముద్ర వేయగలిగింది. ఆమె నటనకే కాదు, వినయానికి కూడా నూటికి నూరు మార్కులు పడతాయి. ఎంత పెద్ద స్టార్డమ్ వచ్చినా అహంకారం లేకుండా సాధారణ జీవనశైలిని కొనసాగించడం అరుదైన లక్షణం. ఇంటర్వ్యూలలోనూ, బహిరంగ కార్యక్రమాల్లోనూ ఆమె మాటల్లో ఒక పరిపక్వత కనిపిస్తుంది. సామాజిక అంశాలపై బాధ్యతాయుతంగా స్పందించడం, మహిళల ఆత్మగౌరవం గురించి స్పష్టంగా మాట్లాడటం ఆమె పట్ల అభిమానుల్లో గౌరవాన్ని మరింత పెంచాయి.
ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు, దర్శకులు సాయి పల్లవిని “నేచురల్ పెర్ఫార్మర్”గా అభివర్ణిస్తుంటారు. ఆమెతో పనిచేసిన వారంతా ఒకే మాట చెప్తారు. “సాయి పల్లవి పాత్రలో నటించదు… జీవిస్తుంది.” అదే ఆమెను ఇతర హీరోయిన్లతో భిన్నంగా నిలబెడుతోంది. సినిమాల్లో స్టార్డమ్ సాధించడం ఒక విషయం అయితే… ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడం మరో విషయం. ఆ రెండింటినీ సమానంగా సాధించిన అరుదైన నటీమణుల్లో సాయి పల్లవి ముందుంటుంది. అందుకే ఆమెకు అభిమానులు హీరోయిన్గా కాకుండా కుటుంబ సభ్యురాలిలా అభిమానాన్ని చూపిస్తారు. సహజత్వమే తన బలం… సహజత్వమే తన భాష… సహజమైన నవ్వే తన అందం అయిన సాయి పల్లవి భవిష్యత్తులో మరెన్నో గొప్ప పాత్రలతో భారతీయ సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలవాలని కోరుకుంటూ… నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సహజ నటి సాయిపల్లవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
_అమరవాజీ నాగరాజు
